Sep 02,2023 21:55

వి.రాంభూపాల్‌

       అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గత వంద సంవత్సరాల్లో ఆగస్టు నెలలో ఎప్పుడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదయిందని చెప్పారు. ఈఖరీఫ్‌లో సాగైనా ఆరు లక్షల ఎకరాల్లో వర్షాభావం వల్ల పంట దాదాపు పూర్తిగా నష్టపోయిందన్నారు. కోట్ల రూపాయలు రైతుల నష్టపోయారని చెప్పారు. ఇంకో ఐదు లక్షల ఎకరాల్లో పంటే సాగు కాలేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ఎకరాకు రూ.50 వేలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకు రుణాలన్నింటినీ మాఫీచేయాలన్నారు. ప్రయివేటు వడ్డీదారుల ఒత్తిళ్ల నుంచి రైతులను కాపాడేందుకు ఆర్‌డిఒ ఆఫీస్‌లో టోల్‌ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలన్నారు. బోరు బావుల కింద సాగు చేసిన పంటలూ విద్యుత్‌ కోతల వల్ల ఎండిపోతున్నాయన్నారు. విద్యుత్‌ కోతలు నివారించి పంటలను కాపాడాలని కోరారు. తక్షణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు జిల్లాలో పర్యటించి కరువు సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గత నెల 30 నుంచి సిపిఎం చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తేదీ జిల్లాలోని అన్ని మండల తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.