ప్రజాశక్తి - కలెక్టరేట్ : జిల్లాలో వర్షాలు లేకపోవడం, కాలువల ద్వారా సక్రమంగా నీరందకపోవడం వల్ల జిల్లాలో ఇప్పటికే చాలా వరకు పంటలు దెబ్బతిన్నందున ప్రభుత్వం వెంటనే కరువు ప్రకటించాలని, అలాగే ఎకరాకు రూ.25వేలు కరువు నష్టపరిహారం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులంతా కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు తక్కువగా కురవడం, జిల్లాలోని కాలువల ఆధారం లేని భూములు, అలాగే కాలువ చివర్లో ఉన్న భూమిలో వరి పంట పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. ఇప్పటికే రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయారని, సమయం దాటిపోయినా పంట నష్టపరిహారం గుర్తించి ప్రభుత్వం పట్టించుకోగా ఏవేవో తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం కరువు ప్రకటించకపోతే రైతుకు రావాల్సిన నష్టపరిహారం రాకపోగా, బీమా కూడా రాదని అన్నారు. కావున ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి యుద్ద ప్రాతిపదికన పంట నష్టం అంచనా వేసి మండలాలు, గ్రామాల వారీగా కరువు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మి నాయుడు, ఉపాధ్యక్షులు బంటు దాసు తదితరులు పాల్గొన్నారు.










