కర్షకులకు అండగా వైసిపి ప్రభుత్వం
- జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి
- వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం జమ
- 49,637 మంది రైతులకు రు.46.67 కోట్లు జమ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
కర్షకులకు అండగా వైసిపి ప్రభుత్వం నిలుస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తెలిపారు. శనివారం రైతు దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా వరుసగా నాల్గవ ఏడాది 2022 ఖరీఫ్ పంట నష్టపోయిన రాష్ట్రంలోని 10.20 లక్షల మంది రైతులకు రూ.1,117.21 కోట్ల బీమా పరిహార మొత్తాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని నంద్యాల కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాల్‌లో లైవ్ ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ భాషా, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహనరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, పట్టు పరిశ్రమ అధికారి పరమేశ్వరి తదితరులు వీక్షించారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా వరుసగా నాల్గవ ఏడాది 2022 ఖరీఫ్ పంట నష్టపోయిన 49,637 మంది రైతులకు రు.46.67 కోట్ల బీమా పరిహారం జమ చేశారని తెలిపారు. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 5238 మంది రైతులకు 10.24 కోట్లు, బనగానపల్లిలో 1548 మంది రైతులకు రూ.3.65 కోట్లు, డోన్‌లో 21,889 మంది రైతులకు రూ.15.08 కోట్లు, నందికొట్కూర్‌లో 14479 మంది రైతులకు రూ.10.37 కోట్లు, నంద్యాలలో 1510 మంది రైతులకు రూ.1.99 కోట్లు, పాణ్యంలో 3,232 మంది రైతులకు రూ.4.28 కోట్లు, శ్రీశైలంలో 1,741 మంది రైతులకు రూ.1.04 కోట్లు మొత్తం 49,637 మంది రైతులకు రు .46.67 కోట్ల బీమా పరిహారం జమ చేసినట్లు చెప్పారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులు పెట్టుబడి పెట్టేందుకు బీమా పరిహారం మొత్తం అందజేయడం ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పంట ఉత్పాదకతకు అవసరమైన పెట్టుబడులు, నాణ్యమైన ఎరువుల కొనుగోలుకు బీమా పరిహార మొత్తం వెసులుబాటు కల్పిస్తుందన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతు పక్షపాతి ప్రభుత్వం విత్తు నుండి పంట కోత వరకు రైతులకు అండగా వుంటుందన్నారు. ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడంతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, ఈ క్రాప్ బుకింగ్ తదితర అంశాలపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం వారు రైతులకు వైఎస్సార్ బీమా పరిహారం చెక్కును అందచేశారు. కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, వివిధ రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.










