లండన్ : కరోనా సోకిన వ్యక్తిని ఇట్టే పసిగట్టే సాధనం వచ్చేసింది. ఈ సాధనాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ ఎలక్ట్రానిక్ సాధనానికి 'కొవిడ్ అలారం' అని పేరు పెట్టారు.
కరోనా బాధితుల నుంచి ఒకింత విభిన్నమైన వాసన వస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చారు. సదరు వ్యక్తి శరీరం నుంచి వెలువడే వాసనను 'కొవిడ్ అలారం' విశ్లేషించి నిర్ధారణ చేస్తుంది. వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (విఒసి) లో మార్పులే ఇందుకు కారణమని, వీరిలో ప్రధానంగా కీటోన్, ఆల్డిహైడ్కు సంబంధించిన పదార్థాలు ఉంటాయని శాస్త్రవేత్తలు వివరించారు. వాసనపరంగా వాటికి ప్రత్యేక ముద్ర ఉంటుందని, దీన్ని పసిగట్టేందుకు ఎల్‌ఎస్‌హెచ్‌టిఎం, రోబోసైంటిఫిక్ లిమిటెడ్, దర్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.. ఆర్గానిక్ సెమీ కండక్టింగ్ సెన్సర్లతో ఒక సాధనాన్ని రూపొందించారు.
15 నిముషాల్లోనే..
ఒక గదిలో ఎవరైనా 15 నిమిషాల వ్యవధిలో కరోనా వైరస్ బారిన పడ్డారా లేదా అనే విషయాన్ని ఈ సెన్సార్ గుర్తిస్తుంది. విమానం క్యాబిన్లు, కేర్ హోంలు, తరగతి గదులు, కార్యాలయాలలో ఈ సాధనాన్ని అమర్చినట్లయితే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్‌షైర్ ఆధారిత సంస్థ రోబో సైంటిఫిక్ చేత సృష్టించబడిన ఈ పరికరం కోవిడ్ సోకిన వారి వాసనను గుర్తిస్తుంది.
98 నుంచి 100 శాతం వైరస్‌ను గుర్తించగలిగింది..
ఈ పరికరాన్ని మొదటగా లండన్‌లోని ఓ యూనివర్సిటీలో ఉంచి పరిశీలించారు. కరోనా సోకిన వ్యక్తుల వద్ద ఉండే స్నాక్స్ నుంచి, శరీర నమూనాలను ఉపయోగించి పరికరంతో పరీక్షించారు. 98 నుంచి 100 శాతం వైరస్‌ను గుర్తించగలిగింది. పీసీఆర్ పరీక్షల కంటే వేగంగా ఇది గుర్తించగలదని పరిశోధకులు తేల్చారు. పరిశోధకులు 54 మందిపై ఈ పరీక్షలు ప్రయోగించగా, అందులో 27 మందికి కోవిడ్ సోకినట్లు తేల్చారు.










