పుట్టపర్తి రూరల్ : శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు తదితర ప్రాంతాలకు చెందిన పది మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.10 లక్షల నగదు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, 14 మొబైల్ ఫోన్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం నాడు శ్రీసత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి విలేకరులకు తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కియా పోలీసు స్టేషన్‌లో ఈనెల 23న ఓ వ్యక్తి క్రికెట్ బెట్టింగులో మోసపోయానంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ కేసును పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా బెట్టింగ్‌తో ప్రమేయం ఉన్న పలువురిని అరెస్టు చేసి విచారించగా క్రికెట్ బెట్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట, విజయవాడలో కొందరును ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇందులో భాగంగా విజయవాడకు చెందిన కంపా గౌతం, అంబాజీ ధర్మారావు(ఏలూరు), పొదల అరుణకుమార్(విజయవాడ) మహేష్ (కష్ణా జిల్లా, కొండపర్ల), కపిల్‌దేవ్ గుణదల (విజయవాడ), మాచర్ల శ్రీహరి (అల్లిపురం, విశాఖపట్నం) రాజులపాటి వంశీకష్ణ (సోమవరం, కష్ణాజిల్లా), రౌతు గోపాలకష్ణ (సోమవారం, కష్ణాజిల్లా)ను అరెస్టు చేశారు. వీరందరినీ విచారించగా కంబా గౌతమ్, బాబీ ఆధ్వర్యంలో వీరందరూ క్రికెట్ బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నట్లు తేలింది. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహించేవారు. ఆన్‌లైన్ మెసేజ్‌లు, పాస్వర్డ్‌ల ద్వారా బెట్టింగ్ వేయడం, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం చేసేవారు. కాగ ఈ బెట్టింగ్ ముఠాలో ఇంకా పలువురు ఉన్నట్లు తెలుస్తోందని, దీనిపై మరింత లోతైన విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ జూదరులను అరెస్టు చేయడంలో కీలకపాత్ర వహించిన పెనుగొండ సిఐ కరుణాకర్, కియా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ వెంకటరమణ, ఆదినారాయణ. పోలీస్ సిబ్బంది మారుతి, రమేష్, నరసింహా, లక్ష్మీనారాయణ రెడ్డి, దస్తగిరి, రామకష్ణులను ఎస్పీ అభినందించారు.










