ప్రజాశక్తి - ఆదోని
క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం పెంపొందుతుందని డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. మంగళవారం ఆదోని మున్సిపల్ క్రీడా మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ పురస్కార గ్రహీత, హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, డీఎస్పీ శివ నారాయణ స్వామి, వైసిపి యువ నాయకులు జయ మనోజ్ రెడ్డి ఆవిష్కరించారు. ఎపి పిఇటి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్‌సిసి విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ శివ నారాయణస్వామి మాట్లాడారు. రాయలసీమ జిల్లాలోని ఒక క్రీడాకారునికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ గొప్ప క్రీడాకారుడుగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిని గౌరవించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. దేశంలో క్రీడలకు, క్రీడాకారులకు గౌరవం ఉందన్నారు. క్రీడల్లో రాణించిన సీనియర్ సిటిజన్లను సన్మానించారు. మున్సిపల్ ఛైర్మన్ శాంత, ఆదోని తాలూకా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, పారిశ్రామికవేత్త విట్టా రమేష్, ఎంఇఒలు శివ రాములు, శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు నరసయ్య, ఆనంద్, రామన్న, జోన్ అధ్యక్షులు నరసింహులు, ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు ఉన్నారు.
ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న అతిథులు










