Jul 19,2023 20:35

క్రికెట్‌ క్రీడాకారిణిని అభినందిస్తున్న విట్టా రమేష్‌

ప్రజాశక్తి - ఆదోని
క్రీడల్లో ప్రతిభ కనబరిచి ఆదోని ప్రతిష్టతను పెంచాలని ఆదోని నియోజకవర్గ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు విట్టా రమేష్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు ముజీబ్‌ అహ్మద్‌ కోరారు. బుధవారం పట్టణానికి చెందిన విద్యార్థిని సంజన, వన్సిక కర్నూలు జిల్లా క్రికెట్‌ జట్టుకు ఎంపికైన సందర్భంగా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పట్టణంలోని కిడ్డీస్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న సంజన, వన్సిక క్రికెట్‌ పట్ల ఆసక్తి చూపేవారని తెలిపారు. ఆసక్తిని గమనించిన కోచ్‌ బాలాజీ రావు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారన్నారు. ఇటీవల కర్నూలు జట్టుకు అండర్‌-15, 19 లెవెల్‌లో జట్టుకు ఎంపికయ్యారని చెప్పారు. ఈనెల 21 నుంచి 23 వరకు తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగే అంతర్‌ జిల్లా క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆడతారన్నారు. అక్కడ మంచిగా ప్రతిభ చాటి రాష్ట్ర జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఆదోని పట్టణం నుంచి ఇప్పటికే అంజలి శర్వాణి జాతీయ జట్టుకు ఎంపికై ప్రతిభ చాటారని తెలిపారు. ఇండియా, బంగ్లాదేశ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో అంజలి శర్వాణి పాల్గొంటున్నారని తెలిపారు. అదే తరహాలో రాణించాలని అభినందించారు. గత 20 ఏళ్లుగా క్రికెట్‌ అసోసియేషన్‌ ద్వారా క్రీడాకారులను తీర్చిదిద్ది ప్రోత్సాహం అందిస్తున్నామని కార్యదర్శి వెంకటేశులు తెలిపారు. క్రీడాకారులకు తమ వంతు సహాయ, సహకారాలు ఉంటాయని వివరించారు.