ప్రజాశక్తి - పాలకొండ , పాలకొండ రూరల్ : అడవులు, కొండలు, వాగులు అక్రమార్కులకు అడ్డాగా మారుతున్నాయి. సహజ సంపదను దర్జాగా దోచుకుంటున్నారు. అడిగిన వాడు లేరని కొంత మంది వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి కొండలను కరిగిస్తున్నారు. ఎటువంటి అనుమతుల్లేకుండా కొండలను తవ్వుకుంటున్నారు. మండలంలో అట్టలి గ్రామంలో కొండను కొంత మంది వ్యక్తులు తవ్వుకుంటూ పోతున్నారు. కంకరను యథేచ్చగా తరిలిస్తున్నారు. రోజుకు వందలాది ట్రాక్టర్లతో కంకరను తరలిస్తున్నారు. జెసిబితో కొండను త్రవ్వి దర్జాగా రవాణా చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనులకు పాతరేసి కొండను కరిగిస్తున్నా పట్టించుకునే అధికారులు లేరు. పట్టించుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఒక వ్యక్తి కంకరను లక్షలాది రూపాయలలో వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు 50 నుంచి 60 ట్రాక్టర్లతో రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.










