ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని కొత్తపేట గ్రామంలో బుధవారం షేక్షావలీ ఇంట్లో 3 తులాల బంగారు నగలు, 30 తులాల వెండి కడియాలు, పట్టీలు, రూ.2 వేల నగదును దుండగులు దొంగతనం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎస్‌ఐ భూపాలుడు దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎస్‌ఐ గ్రామానికి వెళ్లి సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. భయానికి గురైన దుండగుడు రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్ పోయినప్పుడు అపహరించిన నగదు, బంగారు, వెండి నగలను ఓ బట్టలో మూటగట్టి బాధితుని ఇంటి ముందు పెట్టి వెళ్లారు. కొంత సమయానికి విద్యుత్ రావడంతో మూటగట్టిన బట్టను బాధిత కుటుంబ సభ్యులు విప్పి చూశారు. చోరీకి గురైన నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని గ్రహించి ఎస్‌ఐ భూపాలుడుకు వివరించారు. చోరీకి గురైన సొమ్ము రికవరీ కావడంతో గురువారం గ్రామ పెద్ద బాబు, గ్రామస్తులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐకి కృతజ్ఞతలు తెలిపారు.
రికవరీ చేసిన నగలు, నగదును బాధితునికి అప్పగిస్తున్న ఎస్‌ఐ భూపాలుడు










