ప్రజాశక్తి - ఆదోని
బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణంలో నాణ్యత కొరవడిందని పలువురు చర్చించుకుంటున్నారు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన ట్యాంకు అప్పుడే శిథిలావస్థకు చేరుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అప్పుడెప్పుడో బ్రిటీష్ కాలంలో నిర్మించిన రాంజల చెరువు చెక్కు చెదరలేదని పేర్కొంటున్నారు. నాణ్యత లోపం, అధికారుల నిర్లక్ష్యం వల్లే బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకు శిథిలావస్థకు చేరిందని విమర్శిస్తున్నారు.
ఆదోని పట్టణ ప్రజలకు తాగునీరు అందించే ఏకైక వనరు బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకు. ఈ ట్యాంకుకు ఈ దుస్థితి రావడానికి ప్రధాన కారణం ఎవరని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రాంజలలో తాగునీరు నిండుగా ఉన్నా వాటిని వాడుకోరాదని నిపుణులు చెప్పడంతో గతేడాది నుంచి తాగునీటి కోసం వాడుకోవడం లేదు. పట్టణ ప్రజలు బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 20 ఏళ్ల క్రితం అప్పటి పాలకులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదోనిలో ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి భూసేకరణకు పూర్తి చేసేలోపు ప్రభుత్వం మారిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హయాంలో ట్యాంకు నిర్మాణం జరిగింది. అప్పట్లోనే రూ.48 కోట్లతో ఈ ట్యాంకును నిర్మించారు. నిర్మాణ సమయంలోనే పనులు నాణ్యతగా జరగలేదని అప్పట్లోనే నిర్మాణంపై అనేక అపోహలు, విమర్శలు వచ్చాయి. 2005 ఎన్నికైన కౌన్సిల్ దీనిపై 2008లో ప్రత్యేక కమిటీని వేసిందని అప్పటి కౌన్సిలర్, టిడిపి నాయకులు రామచంద్ర తెలిపారు. ట్యాంకు నిర్మాణంలో పెద్దఎత్తున లోపం జరిగిందని, అందుకే ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మించిన ప్రాంతం నల్లరేగడి భూమి కావడం వల్ల నెరలు చాస్తుందని, నిర్మాణంలో కూడా అక్రమాలు జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక అడుగు సిసి లైనింగ్ వేయాల్సి ఉన్నా కేవలం 4 ఇంచుల సిసి లైనింగ్ మాత్రమే వేశారు. 15 ఏళ్లుగా ఎస్‌ఎస్ ట్యాంకు నిర్వహణ చూస్తున్న మున్సిపల్ అధికారులు దీనిపై పూర్తి శ్రద్ధ ఉంచలేదని, అందుకే ఈ దుస్థితి ఏర్పడిందని నిపుణులు పేర్కొంటున్నారు. నాలుగేళ్ల క్రితం ఎస్‌ఎస్ ట్యాంకు సిసి లైనింగ్ 100 మీటర్ల మేర కుంగిపోవడంతో అత్యవసరంగా రూ.60 లక్షల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టారు. ఆ సిసి లైనింగ్ పనులు సక్రమంగా జరగలేదు. అవినీతి, అక్రమాలు జరగడం, రూ.40 లక్షల మేర బిల్లులు వచ్చినా పనులు నాణ్యతగా జరగలేదు. ఫలితంగా ఎస్‌ఎస్ ట్యాంకు లైనింగ్ మళ్లీ కుంగిపోయింది. మున్సిపల్ అధికారులు మరోమారు రాళ్లతో రివిట్‌మెంట్ కోసం రూ.1.80 కోట్లతో పనులకు టెండర్లు పిలిచి కడపకు చెందిన కాంట్రాక్టర్ ద్వారా పనులు చేయించారు. రాళ్లతో చేపట్టిన రివిట్‌మెంట్ సైతం నేడు కుంగిపోయి మళ్లీ అదే దుస్థితికి చేరుకుంది. ఇప్పటివరకు ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.2.40 కోట్ల నిధులు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోయింది. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం, అవినీతి కారణంగా ఈ సమస్య ఏర్పడిందని, మూడేళ్ల నుంచి ఈ సమస్య ఉన్నా శాశ్వత పరిష్కారం ఎందుకు చూపలేకపోయారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. సమస్య శాశ్వత పరిష్కారానికి, బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకును కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటి పంపింగ్ లేని వేసవిలో పనులెందుకు చేపట్టలేకపోయారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎస్‌ఎస్ ట్యాంకు నీటి పంపింగ్ కోసం ఎమ్మెల్యే భూమిపూజ చేసిన సమయంలో కూడా ఈ సమస్యపై ఎందుకు మాట్లాడలేదని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు.
అధికారులను అప్రమత్తం చేస్తున్నాం
- శాంత మున్సిపల్ ఛైర్మన్
పట్టణంలో తాగునీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకు మినహా నీటి నిల్వకు ప్రస్తుతం ఎలాంటి అవకాశమూ లేదు. రాంజల చెరువులో ఉన్న నీటిని బయటికి పంపి కాలువ నుంచి నీటి ప్రవాహం తగ్గకముందే అక్కడి నుంచి పంపింగ్ పనులకు శ్రీకారం చుట్టే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. నీటి వృథాను కూడా అరికట్టే విధంగా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. తుంగభద్ర డ్యాంలో నీరు పుష్కలంగా ఉంది. తాగునీటికి ఇబ్బంది ఉండదు. ఎలాంటి అపోహలూ పెట్టుకోవద్దు.
యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులకు చర్యలు
- రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్
బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకు బండ్ మరమ్మతుల కోసం ఇప్పటికే రూ.10 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. సమస్యను ఉన్నతాధికారులకు వివరించి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఎల్‌ఎల్‌సి కాలువలో నీటి ప్రవాహం ఉండడం వల్ల పంపింగ్ ద్వారా క్లోరినేషన్ చేసి నీటిని సరఫరా చేస్తున్నాం. చెరువు గట్టుకు పగుళ్లు ఏర్పడడంతో నీటి పంపింగ్ తగ్గించాం. రాంజల చెరువులోని నీటిని బయటికి పంపి పరిసరాలను శుభ్రం చేసి బసాపురం కాలువ నుంచి పంపింగ్ చేసి నీటి నిల్వ ఉంచుతాం. నీటిఎద్దడి రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
తాగునీటి ఎద్దడి రాకుండా తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వాలి
- లక్ష్మణ్, సిపిఎం పట్టణ కార్యదర్శి
ఆదోని పురవాసులకు తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో స్పష్టం చేయాలి. ప్రస్తుతం ఎల్‌ఎల్‌సి కాలువ ద్వారా నీటిని నేరుగా మోటార్లతో పంపింగ్ చేసి ఓవర్‌హెడ్ ట్యాంకులకు నింపుతున్నారు. అనివార్య కారణాల వల్ల ఎల్‌ఎల్‌సికి నీటి ప్రవాహం తగ్గితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతోంది. ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం.
కుంగిపోయిన చెరువు కట్ట










