Sep 24,2023 20:56

అనంతపురంలో కొరటాలకు నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు

             ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి కొరటాల సత్యనారాయణ ఆశయాల బాటలో మనమందరం నడద్దామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొరటాల సత్యనారాయణ శత జయంతిని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని గణేనాయక్‌ భవన్‌లో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరటాల సత్యనారాయణ నిత్య అధ్యయన శీలి, సమస్యల పట్ల సమగ్ర అవగాహన ఉన్న నాయకుడు అన్నారు. సమాజంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా సంఘాలను ఏర్పాటు చేసి ప్రజలను కదిలించేవారన్నారు. కొరాటాల ఆశయాలు నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. కొరటాల జన్మించి నేటికి 100 సంవత్సరాలు పూర్తయిందన్నారు. 1923 సెప్టెంబర్‌ 24వ తేదిన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం, ప్యాపర్రు గ్రామంలో బుచ్చయ్య, శేషమ్మ దంపతులకు జన్మించారన్నారు. పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనైనా పెరిగింది ప్రజల మద్య, పని చేసింది శ్రామిక జనం కోసమే అన్నారు. హైస్కూలులోనే డిటెన్షన్‌ విధానానికి వ్యతిరేకంగా 11 రోజుల విద్యార్థుల సమ్మెకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. గుంటూరు ఎసి. కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేరి మధ్యలోనే చదువు ఆపేసి ప్రజా ఉద్యమాలకు తన యావత్‌ జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. నాటి నుంచి ఆఖరి శ్వాస వరకు మార్కిస్టు, లెనినిస్టు సిద్ధాంతంపై అత్యంత విశ్వాసంతో ఉంటూ కమ్యూనిస్టు పార్టీలో తొలుత ఉమ్మడి సిపిఐ తరువాత సిపిఐఎంలో పని చేశారని గుర్తు చేశారు. 1946-48 మధ్య తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం సాగుతున్న రోజుల్లో ఆంధ్ర ప్రాంతంలో దానికి మద్ధతుగా నిలబడి జైలుపాలయ్యాడని తెలిపారు. 1948లో అరెస్టై కడలూరు జైలులో గడిపారని తెలిపారు. గుంటూరు జిల్లాలో బంజరు భూములు, లంక భూములు కోసం పేదలను కదిలించి పోరాటాలు నిర్వహించారని తెలిపారు. వ్యవసాయ కూలీల వేతనాల పెంపు కోసం పోరాడారని తెలిపారు. కొరటాల ఆశయ బాటలో నడవడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప, ఎం.బాలరంగయ్య, బి.శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులు వి.రామిరెడ్డి, ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.కృష్ణమూర్తి, వై.వెంకటనారాయణ, టి.రామాంజినేయులు, ఎస్‌.భాస్కర్‌, జి.జగన్‌, వి.నిర్మల, ఎ.రంగారెడ్డి, బి.అబ్యుత్‌, సూర్యచంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్‌, పి.శ్రీనివాసులు, ఎన్‌పిఆర్‌డి జిల్లా కార్యదర్శి ఎం.రామయ్య శివశంకర్‌, రమేష్‌, దాసరి శ్రీనివాసులు, సాకే నాగరాజు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.