Sep 19,2023 19:45

మంత్రి గుమ్మనూరుకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి- దేవనకొండ
హంద్రీనీవాకు గుండ్లకొండ దగ్గర స్లూయిజ్‌ ఏర్పాటు చేసి కోటకొండ వరకు సాగునీరు ఇవ్వాలని రైతుసంఘం, వ్యకాస నాయకులు డిమాండ్‌ చేశారు. మండలంలోని చెరువులన్నింటినీ హంద్రీనీవా నీటితో నింపాలని, పంట కాలువ నిర్మాణం చేపట్టాలని కోరారు. మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు వ్యకాస జిల్లా అధ్యక్షులు బి.వీరశేఖర్‌, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సూరి, సీనియర్‌ నాయకులు నారాయణస్వామిలు రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హంద్రీనీవా ప్రధాన కాలువకు గుండ్లకొండ వద్ద స్లూయిజ్‌ ఏర్పాటు చేసి గుండ్లకొండ నుంచి కోటకొండ వరకు గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బంటుపల్లి, చెల్లెలి చెలిమిల, బేతపల్లి, బండపల్లి, వెంకటాపురం, పల్లెదొడ్డి, మాచాపురం వంటి 12 గ్రామాల్లో 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం, ఇరిగేషన్‌ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మండలంలో హంద్రీనీవా నుంచి 42 వేల ఎకరాలకు సాగు స్థిరీకరణ ఉందని, పంట కాలువ లేకపోవడంతో రైతులు హంద్రీనీవా నీటిని వినియోగించుకోలేకపోతున్నారని తెలిపారు. వెంటనే పంట కాలువలను నిర్మించాలని కోరారు. మండలంలోని హంద్రీనీవా కాలువ పనులు పాలకుర్తి నుంచి తెర్నేకల్‌ వరకు, కప్పట్రాళ్ల దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుసంఘం నాయకులు షాకీర్‌, అశోక్‌, రైతులు జయచంద్ర, తిప్పన్న, మాదాల మార్కండేయులు, కౌలుట్ల స్వామి, భాస్కర్‌ పాల్గొన్నారు.