ప్రజాశక్తి - మంత్రాలయం
గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లు తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకున్నారని వైసిపి మండలాధ్యక్షులు జి.భీమిరెడ్డి, ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. గురువారం సాయంత్రం స్థానిక వెంకటేశ్వర ప్రైమరీ స్కూల్‌లో 2, 3వ తరగతి చదువుతున్న విద్యార్థులు సుమారు 30 మంది బస్టాండ్ దగ్గర సూగూరుకు వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి విద్యార్థులకు చాక్లెట్లు పంచాడని తెలిపారు. వాటిని తిన్న 9 మంది వాంతులు చేసుకున్నారని చెప్పారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు 108 అంబులెన్స్ ద్వారా కలుదేవకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పరీక్షించిన వైద్యులు ప్రమాదం లేదని, పాఠశాల వదిలే ముందు అల్బెండజోల్ టాబ్లెట్లు విద్యార్థులకు ఇచ్చినందున ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. వెంటనే స్పందించిన పిహెచ్‌సి వైద్యులు గోవిందమ్మ, భావనను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అభినందించారని భీమిరెడ్డి పేర్కొన్నారు.
విద్యార్థులను పరామర్శిస్తున్న నాయకులు










