Apr 16,2023 08:19

పొలాల్లో ఎర్రజెండాలు పాతిన అనంతరం సాగుదారులతో మాట్లాడుతున్న వ్యకాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు

        రొద్దం : దశాబ్ధాలుగా సాగులో ఉన్న పేదల భూములను అక్రమంగా లాక్కోవాలని చూస్తే చూస్తూ ఊరుకోమని సిపిఎం, వ్యకాసం ఆధ్వర్యంలో వారికి అండగా నిలబడి పోరాటం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. రొద్దం మండలంలోని కోగిర రెవెన్యూ పొలంలో వ్యకాసం ఆధ్వర్యంలో సాగుదారులు శనివారం నాడు భూస్వాధీన ఉద్యమం నిర్వహించారు. వ్యకాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, సత్యసాయి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న తదితరులు సాగుదారులతో కలిసి పొలాల్లోకి వెళ్లారు. ఈ సమయంలో అక్కడున్న టింబక్టివ్‌ కలెక్టివ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రయివేటు రౌడీలు వ్యకాసం నాయకులు, పేదలను బలవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని ఎదిరించి వ్యకాసం నాయకులు, సాగుదారులు భూముల్లోకి ప్రవేశించారు. ఆ భూముల్లో ఎర్రజెండాలు నాటి భూ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల పరిధిలోని కోగిర సమీపంలో కొండ ప్రాంతంలో ఉన్న భూములను కోగిర, కంబాలపల్లి, శ్యాంపురం గ్రామాలకు చెందిన దళిత, గిరిజన, బీసీ నిరుపేద రైతులు దశాబ్ధాల కాలం నుంచి సాగు చేసుకుంటున్నారని చెప్పారు. పేదల అనుభవంలో ఉన్న కోగిర రెవెన్యూ పొలం సర్వే నెంబర్‌ 666 నుంచి 669 వరకు దాదాపు 4500 ఎకరాల భూమిని ప్రభుత్వం, అధికారులు టింబక్టివ్‌ కలెక్టివ్‌ అనే ప్రయివేటు స్వచ్ఛంద సంస్థకు దొడ్డిదారిని అప్పజెప్ప కుట్ర జరుగుతోందన్నారు. సదరు స్వచ్ఛంద సంస్థ కూడా ఆ భూములను నిబంధనలకు విరుద్ధంగా భూకబ్జాకు పాల్పడి దౌర్జన్యంగా ఆక్రమించుకుంటోందన్నారు. పేదలను భూముల్లోకి రానివ్వకుండా సెక్యూరిటీ పేరుతో వారి ప్రయివేటు రౌడీలతో భయపెడుతోందన్నారు. భూముల్లోకి వెళ్తే దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. మహిళలు అని చూడకుండా వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయన్నారు. తప్పుడు పత్రాలతో భూములను కాజేసే కుట్ర చేస్తున్నారని చెప్పారు. బాధితులకు భూమి దక్కేంత వరకు సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం వారి పక్షాన పోరాటం సాగిస్తుందని చెప్పారు. భూమి అన్యాక్రాంతం కాకుండా పేదలకు దక్కే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సాగుదారులకు అడ్డు తగులుతూ దాడులు చేస్తున్న సంస్థకు చెందిన రౌడీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు స్పందిచకుంటే రానున్న ఖరీఫ్‌లో తామే దగ్గరుండి రైతులతో ఆ పొలాల్లో సాగు చేయిస్తామన్నారు. భూమిలేని ప్రతి పేదవాన్ని గుర్తించి ఈ భూమిని వారికి పంచతామని తెలిపారు. అవసరం అయితే కోర్టు ద్వారా న్యాయ పోరాటానికి కూడా వెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రాముడు, నారాయణ, సాగుదారులు కిష్టప్ప, నరసింహప్ప, మారుతి, నారాయణమ్మ, అనితమ్మ, లక్ష్మీబాయితో పాటు 200 మంది పాల్గొన్నారు.