Aug 23,2023 22:26

దీక్షల్లో పాల్గొన్న వంతెన సాధన కమిటీ నాయకులు, టిడిపి నాయకులు

కొమరాడ: మండలంలోని నాగావళి నదిపై పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు మంచి ఆదరణ పెరుగుతుంది. బుధవారం ఏడో రోజు కోమట్లపేట వద్దని సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా వినూత్న రీతిలో ఆవుల మెడలో పువ్వుల దండలు వేసి నిరసన శిబిరం వద్ద రిలే నిరాహార దీక్ష చేశారు. ఇప్పటికే అన్ని పార్టీల, ప్రజాసంఘాల నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గానీ నోరులేని మూగజీవులు కూడా నిరాహార దీక్షకు వచ్చి మద్దతు తెలిపి పరిస్థితి ఉందంటూ ఎద్దేవా చేశారు. దీక్షలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కోశాధికారి మండంగి రమణ, సహాయ కార్యదర్శి మండంగి శ్రీనివాసరావు , నేటి ధర్మబాణం ఎడిటర్‌ అట్టాడ రవికుమార్‌, అరకు పార్లమెంటు ఎస్సీ, ఎస్టీ సెల్‌ అధికారి ప్రతినిధి నందివాడ కృష్ణ బాబు, అరకు పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షులు దేవకోటి వెంకటనాయుడు, అరుకు పార్లమెంటు ఎస్టీ సెల్‌ అధ్యక్షులు బిడ్డిక తమ్మయ్య, కొమరాడ పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు మరిచర్ల సత్యనారాయణ సంపూర్ణ మద్దతు తెలిపారు. మండలానికి అతిముఖ్యమైన వంతెన పెండింగ్‌ పనులు పూర్తిచేసి గిరిజనుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్‌ చేశారు. రిలే నిరాహార దీక్షలో సాధన కమిటీ సభ్యులు వి.ఇందిర, కొల్లి సాంబమూర్తి, బత్తిలి శ్రీనివాసరావు, పాలక నూకరాజు, పకీరు, కందిస శంకర్రావు, లక్ష్మణరావు, పోలినాయుడు, నాగావళి నది ఆవల ఉన్న గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
పూర్ణపాడు లాబేసు వంతెన నిర్మించాలి
సాలూరు: కురుపాం నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ఎపి గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు సీదరపు అప్పారావు డిమాండ్‌ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22 గ్రామ పంచాయతీలకు చెందిన 60 గ్రామాల ప్రజలు ఈ వంతెన నిర్మాణం కాకపోవడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 2004లో సిపిఎం, ఇతర గిరిజన సంఘాల పోరాట ఫలితంగానే అప్పటి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి అనుమతి మంజూరు చేసిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికీ అసంపూర్తిగా మిగిలి వుందని చెప్పారు. వైసిపి ఈ ప్రాంత ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈనెల 17నుంచి వంతెన నిర్మాణం కోరుతూ గిరిజనులు, ప్రజాసంఘాల ఆధ్వర్యాన రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ దీక్షలకు గిరిజన సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. సమావేశంలో గిరిజన సంఘం నాయకులు సూకురు గంగయ్య, సీదరపు బోడమ్మ పాల్గొన్నారు.