ప్రజాశక్తి - విలేకరులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐదు రోజులుగా చేపడుతున్న నిరసన కార్యక్రమాలు గురువారమూ కొనసాగాయి. ఈ సందర్భంగా పలుచోట్ల ధర్నాలు చేపట్టారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
జంగారెడ్డిగూడెం : చంద్రబాబు అరెస్టు వైసిపి ప్రభుత్వ దుర్మార్గ చర్య అని టిడిపి పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం మూడో రోజు కొనసాగింది. రిలేదీక్షలో పాల్గొన్న టిడిపి నాయకులకు, కార్యకర్తలకు సంఘీభావం తెలుపుతూ కృష్ణ మాట్లాడారు. యువతకు నైపుణ్య శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చిన చంద్రబాబు కృషిని, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్కవరం మాజీ ఎంపిటిసి ఎ.బజారు, కొండ్రు నాగరాజు, ఎం.ఉదరు, బేతాళ మురళీకృష్ణ, మన్యం దుర్గారావు, దుద్దే దుర్గారావు, కొత్తూరు బోసు, నెక్కలపొడి శ్రీనివాస్, చిక్కాల పండు, కొండ్రెడ్డి సోమరాజు, సాయల సత్యనారాయణ, తడికమళ్ల గోపాలరావు, పగడం సౌభాగ్యవతి, తూటికుంట రాము, దాసరి శ్యామ్‌చంద్రశేషు, షేక్ ముస్తఫా, కుమార్, రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.
చాట్రాయి : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చాట్రాయిలోని టిడిపి కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ ధర్నాలో పాల్గొన్న నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుతో వైసిపి పతనానికి పునాది పడిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవరెడ్డి, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, విజయ డైరీ మిల్క్ డైరెక్టర్ బొట్టు రామచంద్రరావు, మండల కార్యదర్శి పలగాని దుర్గారావు, కంచర్ల హనుమంత రావు, రాయవరపు పుల్లారావు, కమ్ముల కొండలరావు, మాజీ సర్పంచులు కోటా జోషి, గార్లపాటి మారేష్, తెలుగు మహిళా నాయకురాలు చంద్రకళ, ధనలక్ష్మి పాల్గొన్నారు.
టిడిపి నాయకుల ఆందోళనకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పిఎస్ నాయకులు కొమ్ము ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి మారేష్, కోటా జోషి, గద్దల నాగేశ్వరరావు, జయరాజ్, ప్రసాద్ పాల్గొన్నారు.
ముసునూరు : ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించాల్సిన వ్యక్తిని జైల్లో పెట్టి, 20 సంవత్సరాలు వెనక్కినెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమని నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. ముసునూరు గ్రామంలోని మండపం సెంటర్ వద్ద రెండో రోజు రిలే నిరహారదీక్షలో ముద్దరబోయిన, అట్లూరి రవీంధ్ర, గద్దే రఘుబాబు, కొల్లి గంగారామ్, మేదరమెట్ల సురేంద్ర, లక్కపాం కాంతారావు, గద్ధల మోహనరావు, సూర్యదేవర శ్రీనివాసరావు, రాపర్ల ప్రతాప్, రాపర్ల బాలకృష్ణ, గూడపాటి అజరు, కందుల పిచ్చియ్య, సత్యనారాయణ, శేషగిరిరావు పాల్గొన్నారు.
కైకలూరు : చంద్రబాబు విడుదలయ్యే వరకూ దీక్షలు కొనసాగుతాయని మాజీమంత్రి మాగంటి బాబు స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కైకలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షలో మాగంటి బాబు పాల్గొన్నారు. ఈ దీక్షకు పలువురు సంఘీభావం తెలిపారు. మాజీ ఎంఎల్‌సి కమ్మిలి విఠల్‌రావు, టిడిపి మండల అధ్యక్షులు పెన్మెత్స త్రినాథ్‌రాజు, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు బొమ్మనబోయిన విజయలక్ష్మీ, రాష్ట్ర తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి పూల రామచంద్రరావు, తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు చలసాని జగన్మోహన్‌రావు, టిడిపి జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి పోలవరపు లక్ష్మీరాణి, టిడిపి బిసి సెల్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ చక్రవర్తి పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో టిడిపి వడ్డీ సాధికారిక రాష్ట్ర కన్వీనర్ భలే ఏసురాజు, టిడిపి ఎస్‌సి సెల్ రాష్ట్ర కార్యదర్శి పంతగాని సురేష్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చాబత్తిన విజరు, నాయకులు పాల్గొన్నారు.
ముదినేపల్లి : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ముదినేపల్లిలో టిడిపి నేతల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. టిడిపి కార్యాలయం వద్ద కొడాలి వినోద్ ఆధ్వర్యంలో 'మేము సైతం' అంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ దీక్షలో దావు నాగరాజు, ఈడే సుధాకర్, బి.రవి, పి.సురేష్, వంశీధర్, పి.విశ్వేశ్వరరావు, వి.నరసింహారావు, కె.సుబ్బారావు, బి.రవికుమార్, అయ్యప్ప పాల్గొన్నారు.










