కొండెక్కిన కోడి ధరలు
- మందగించిన అమ్మకాలు
- వ్యాపారం లేక దుకాణాలు వెలవెల
ప్రజాశక్తి - బనగానపల్లె
వేసవికాలం కావడంతో చికెను ధరలు కొండెక్కాయి. 20 రోజుల నుండి చికెను ధరలు పైపైకి పెరుగుతున్నాయి. బనగానపల్లె పట్టణంలో కిలో చికెన్ స్కిన్‌తో రూ.260, స్కిన్‌లెస్ రూ.280 ధర పలుకుతుంది. ఎండల వేడికి కోళ్లు చనిపోతుండంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. మూడు నెలల నుంచి కిలో చికెన్ 100 రూపాయల నుండి 140 వరకు ధర పెరుగుతూ వచ్చింది. ఒక్కసారిగా కిలో చికెన్ 260 పలకడంతో చికెన్ కొనడానికి మాంసం ప్రియులు వెనక్కి తగ్గుతున్నారు. దీంతో అమ్మకాలు తగ్గి వ్యాపారులు లబోదిబోమంటున్నారు. సాధరణంగా మార్కెట్లో ఒక్కో చికెన్ దుకాణంలో రోజుకు 100 నుంచి 150 కిలోలు అమ్మకాలు జరిగేవి. ధర పెరగడంతో 30 నుంచి 50 కిలోలు మాత్రమే అమ్ముడుపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మధ్యాహ్నం నుంచి కిలో చికెన్ 20 రూపాయలు తగ్గించినా కొనుగోలుదారులు ముందుకు రావడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. రాష్ట్రంలో కోళ్ల ఫారాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నా వేసవిలో ఎండ తీవ్రతకు బ్రాయిలర్ కోళ్లు తట్టుకోలేక మత్యువాత పడుతుండడంతో ఫారాల సంఖ్య తగ్గుతోంది. కర్ణాటక రాష్ట్రంలో కాస్త ఎండ తీవ్రత తక్కువగా ఉండడంతో బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఎక్కువగా ఉంటుంది. దేవనహళ్లి, టుంగూరు వంటి ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. గతంతో పోలిస్తే కోళ్లకు వేసే దాణా ధరలు పెరిగాయి. సోయా, మొక్కజొన్న, సజ్జలను మిశ్రమం చేసి దాణాగా తయారు చేసి కోళ్లకు అందిస్తారు. ప్రస్తుతం 50 కేజీల బస్తా 2500 ఉండగా, గత సంవత్సరం 1800 విక్రయించే వారు. దాణా ధర పెరగడంతో పాటు వేసవిలో కోళ్లు డిమాండ్ తగ్గ సప్లరు లేకపోవడంతో చికెన్ ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
చికెన్ కొనలేకపోతున్నాం
- రాంపుల్లయ్య, పలుకూరు గ్రామం
చికెన్ ధర పెరగడంతో కొనలేకపోతున్నాం. మార్కెట్లో రేట్లు చూస్తే సామాన్య ప్రజలు చికెన్ కొనలేని పరిస్థితి తలెత్తింది. చికెన్‌కి బదులు పప్పన్నంతోనే సర్దుకుపోతున్నాం. రోజు కూలి పనికి పోతే రూ.250 నుండి రూ.300 ఇస్తున్నారు. రోజంతా కూలి పని చేస్తే చికెన్‌కే సరిపోయే పరిస్థితి తలెత్తింది. మిగిలిన సరుకులు ఎలా కొనాలో అర్థం కాక చికెన్ కొనడమే బంద్ చేశాం.
వ్యాపారం లేక నష్టపోతున్నాం
- ముక్తియార్ చికెన్ వ్యాపారి
ఎండల వేడిమికి కోళ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో చికెన్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మార్కెట్లో లైవ్‌కోడి ధర 230 రూపాయలు పైనే పలుకుతుంది. ఇలాంటి సమయంలో ధరలు పెరగడం మామూలే. ధరలు పెరగడంతో చికెన్ కొనేందుకు జనాలు రావడం లేదు. మధ్యాహ్నం కిలోపై రూ.20 తగ్గించినా ఎవరు కొనడం లేదు. ప్రతిరోజు వ్యాపారంలో నష్టపోతున్నాం. చికెన్ ధరలు తగ్గించాలి.










