Sep 12,2023 11:33

 రైలుకు ఎదురెళ్లి  రైతు ఆత్మహత్య
లక్నో : 
 ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కొందరు బిజెపి నేతలు భూకబ్జాలకు పాల్పడుతూ రైతుల ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బిజెపి నాయకుడు భూకబ్జా చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ రైతు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. కాన్పూర్‌ జిల్లా చకేరి గ్రామానికి చెందిన బాబు సింగ్‌ యాదవ్‌ తనకున్న పొలంలో పంటలు పండిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. యాదవ్‌కున్న 6.5 బిగాల భూమిని బిజెపి నాయకుడు దివాకర్‌ కబ్జా చేశాడు. దీంతో కుటుంబాన్ని పోషించడం యాదవ్‌కు ఇబ్బందిగా మారింది. దిక్కుతోచని స్థితిలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదవ్‌ మతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టానికి తరలించారు. ఘటనాస్థలిలో సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన పేరిట ఉన్న 6.5 బిగాల అగ్రికల్చర్‌ ల్యాండ్‌కు రూ.6.29 కోట్ల నకిలీ చెక్కులు ఇచ్చి, దివాకర్‌ బలవంతంగా కబ్జా చేశాడని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను కట్టడి చేయాలని సిఎం యోగిని అభ్యర్థించారు. మీ సొంత పార్టీ నాయకులే రూల్స్‌ను బ్రేక్‌ చేస్తున్నారని తెలిపారు. వీలైతే తన పిల్లలకు న్యాయం చేయాలని యోగిని ఆ రైతు కోరారు.