Aug 11,2023 18:46

ప్రజాశక్తి-రామచంద్రపురం
తొలకరి వరి చేల్లో గట్లు చుట్టూ కందిచెట్లు పెంపకం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ఇళ్ల సూర్యనారాయణ అన్నారు. కె. గంగవరంలో శుక్రవారం మండల వ్యవసాయ సలహా కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఇళ్ల సూర్యనారాయణ మాట్లాడుతూ తొలకరి పంట 2023కి సంబందించిన పంట నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, రౖతులందరూ తప్పని సరిగా వరితో పాటు ఇతర ఉద్యానవన పంటలు నమోదు చేయిచుకోవాలన్నారు. భవిష్యత్తు లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇదే ప్రాతిపదిక అవుతుందని దీనిని రైతులంతా గమనించాలని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా అందించే కందులను వరి గట్ల చుట్టూ పెంచుకోవడం వల్ల అదనపు ఆదాయం పొందే దిశగా కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కందులు కావలసినవారు స్థానిక రైతు భరోసా కేంద్రాల లో సంప్రదించి గట్ల మీద చల్లుకోవాలన్నారు. మండల వ్యవసాయ అధికారి బలుసురవిమాట్లాడుతూ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో భాగంగా చిరుధాన్యాల పెంపకం పట్ల రైతులలో అవగాహన కొరకు మరియు చిరుధాన్య పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడంలో భాగంగా ప్రభుత్వం రాగులు మరియు కొర్రలు కొద్ది మొత్తంలో ప్రయోగాత్మకంగా పంపిణీ చేయడానికి సిద్ధమైందన్నారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు మరియు మిగిలిన గ్రామాల్లో మిగులు భూములు లేదా దిమ్మలు వ్యవసాయానికి పనికివచ్చే సాగులో లేని భూముల్లో వేసుకొని చిరుధాన్యాల పెంపకం ద్వారా అదనపు ఆదాయం మరియు తద్వారా వాటిని ఉపయోగించుకోవడం వల్ల మంచి ఆరోగ్యం రెండు కలుగుతాయని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్‌ భత్తుల అప్పారావు, మండల ఉద్యానవన అధికారి అనూషా, కోటిపల్లి ఇరిగేషన్‌ ఎఇ సుబ్బారావు, పశు వైద్యులు రామరాజు, అన్ని గ్రామాల వ్యవసాయ ఉద్యాన సహాయకులు రైతులు పాల్గొన్నారు..