ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : 'ఆరుగాలం కష్టించి సాగుచేశాం. నీరు లేక, వర్షాలు రాక పంటంతా కళ్లెదుటే ఎండిపోతోంది. కాపాడుకునే మార్గం కనిపించడం లేద'ంటూ గిరిజనులు సిపిఎం బృందం ముందు కన్నీటి పర్యంతమయ్యారు. గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠా ప్రాంతమైన దుడ్డుఖల్లు పంచాయతీ పరిధిలోని కొత్తవలస, కొల్లిగూడ, దొరకెక్కువ, దాదుపురం తదితర గ్రామాల పరిధిలో సుమారు 100 ఎకరాల మేర పంట సాగునీరు లేక ఎండిపోతోంది. ఈ పంటలను సిపిఎం బృందం బుధవారం పరిశీలించింది. గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంది. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో సాగునీరు లేక వరి, పత్తి, మినుములు, పెసర పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కరువు పరిస్థితులు తప్పేటట్లు లేవని వాపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో సాగునీటి వనరుల పుష్కలంగా ఉన్నా వాటిపై మినీ రిజర్వాయర్లు, చెక్‌డ్యాములు నిర్మించకపోవడంతో పంట పొలాలకు సాగునీరు అందడం లేదని వివరించారు. దీంతో ప్రతి ఏడాది వర్షాధారంపైనే ఆధారపడి పంటల పండించుకోవలసి వస్తుందని తెలిపారు. చెక్‌డ్యాములు నిర్మించాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించుకున్నా కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు అప్పులు తెచ్చి ఖరీఫ్ సాగు చేశామని, పంటలకు నష్టం వాటిల్లడంతో ఏం చేయాలో తోచడం లేదని ఆవేదన చెందారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.మన్మథరావు మాట్లాడుతూ ఈ ఏడాది సకాలంలో వర్షాలు లేక ఏజెన్సీ ప్రాంతంలో కరువు పరిస్థితులు ఎదురవుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించి కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పువ్వల తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
చుక్క చినుకు లేదు
వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మండిపోవడంతో వరిచేలు పూర్తిగా ఎండిపోతున్నాయి. 20 రోజులుగా చిన్నపాటి చినుకు కూడా లేకపోవడంతో కరువు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
- గోల తిరుపతిరావు, వైస్ సర్పంచ్, దుడ్డుఖల్లు
దిగుబడి అంతంత మాత్రమే
ఈ ఏడాది సకాలంలో వర్షాలు లేక పంటలు దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఈ ఏడాది తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. తెచ్చిన వేలాది రూపాయలు అప్పులు ఎలా తీర్చాలి.? రెవెన్యూ అధికారులు స్పందించాలి.
- తోయక మాణిక్యం,
గిరిజన మహిళా రైతు










