Aug 28,2023 22:59

పెనమలూరు: తాడిగడప మున్సిపల్‌ పరిధిలోని ఆర్‌ఎస్‌ నెం.14లోని కొండపోరంబోకు స్థలంలో గత 40 సంవత్సరాల నుంచి ఉంటున్న తమ నివేశనా స్థలాలకు పట్టాలిచ్చి, రెగ్యులరైజేషన్‌ చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో యనమలకుదురు వాసులు సోమవారం కృష్ణాజిల్లా కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యనమలకుదురు గ్రామంలోని కొండపై ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం డెవలప్మెంట్‌ పేరుతో కొంతమంది అగ్రకులస్తుల పెత్తందార్లు అధికారులపై ఒత్తిళ్లు తెస్తూ కొండపై చెట్లను నరికివేస్తూ, కొండను ప్రొక్లెయినర్‌తో తవ్వుతున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ ఇళ్లపై కొండరాళ్లు పడే ప్రమాదం ఉందన్నారు. మట్టి నమూనాలపై తప్పుడు నివేదికలు ఇచ్చి తమను ఇక్కడ నుంచి పంపించేందుకు కొంతమంది చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని విమర్శించారు. తాము నివాసం ఉంటున్న ఇళ్లకు వెంటనే పట్టాలు ఇప్పించాలని కోరారు. అనంతరం సిపిఎం నాయకులు ఎస్‌కె.ఖాశీం ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.