ప్రజాశక్తి - ఆదోని
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం చేపడుతున్న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు లక్ష్మన్న, లింగన్న, కార్యదర్శి వర్గసభ్యులు గోపాల్, తిప్పన్న, వీరారెడ్డి, రామాంజనేయులు, నాయకులు తిక్కప్ప, నాగరాజు కోరారు. ఆదివారం ఆదోనిలోని సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 2న ఆదోని నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర 7న కలెక్టరేట్ చేరుకుంటుందని తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న తాగు, సాగునీటి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో రాజకీయంగా అత్యున్నతమైన పదవులు పొందిన రాజకీయ నాయకులు జిల్లా అభివృద్ధికి చేసింది శూన్యమని విమర్శించారు. సిపిఎం మహా పాదయాత్రకు జిల్లాలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతూ, సమస్యలను పాదయాత్ర దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. ఆదోనిలో శిథిలావస్థకు చేరుకున్న పాత ఫ్లై ఓవర్ బ్రిడ్జి స్థానంలో కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. పట్టణ జనాభాకు అనుగుణంగా అదనంగా మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆదోని ప్రభుత్వాస్పత్రిని జిల్లాస్థాయి ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ, అన్ని రకాల జబ్బులకు వైద్యులను నియమించి మెరుగైన వైద్య పరికరాలు, సిటి స్కాన్, ఎంఆర్‌ఐ ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న బైపాస్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపడుతున్న కలెక్టరేట్ ముట్టడిలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు










