Oct 04,2023 21:50

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
           మాతా, శిశుమరణాల నివారణ లక్ష్యంగా గర్భిణుల్లో రక్తహీనతను నివారించేందుకు అక్షజ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. బుధవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఏలూరు సెయింట్‌ థెరిస్సా మహిళా కళాశాల, మార్పు సేవా సంస్థల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యంగా గర్భిణులో రక్తహీనతను నివారించేందుకు ఆరు నెలలపాటు పౌష్టికాహార కిట్లను అందిస్తామన్నారు. ఈ నేపథ్యంలో మహిళా శిశుసంక్షేమశాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన ఆర్‌.సూయిజ్‌, ఏలూరు సెయింట్‌ థెరిస్సా మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ సిస్టర్‌ మెర్సీ నేతృత్వంలో ప్రోటీన్‌ కలిగిన పొడి, మునగాకులతో తయారుచేసిన లడ్డూలతో కూడిన న్యూట్రిషన్‌ ప్యాకెట్లను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా గిరిజన మండలాలైన జీలుగుమిల్లి, టి. నర్సాపురం, బుట్టాయగూడెంల్లో గర్భిణులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే జిల్లావ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. విజయవాడ మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్‌రన్‌గా నిర్వహించారని, అక్కడ మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణుల్లో రక్తహీనత మూలంగా ప్రసవ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఈ దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ప్రతిరోజూ వీటిని ఆయా మహిళలు తీసుకుంటున్నదీ, లేనిదీ స్థానిక ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పర్యవేక్షిస్తారన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ పోషణ, గోరుముద్ద, టేక్‌ హోం రేషన్‌ కార్యక్రమాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తు న్నారన్నారు. పిల్లలకు రాగి, చిక్కీలు, గర్భిణులకు పోషకాహార కిట్లను అందిస్తున్నారని, వాటిని సంబంధిత వ్యక్తులే వినియో గించాలే తప్ప ఇతరంగా వినియోగించకుండా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు అక్షజ పౌష్టికాహార కిట్లను కలెక్టర్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి, ఐటిడిఎ పిఒ ఎం.సూర్యతేజ, అసిస్టెంట్‌ ట్రెయినీ కలెక్టర్‌ శ్రీపూజ, మార్పు సేవా సంస్థ ప్రతినిధి ఆర్‌.సూయిజ్‌, సెయింట్‌ థెరిస్సా మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ సిస్టర్‌ మెర్సీ, ఐసిడిఎస్‌ పీడీ విజయలక్ష్మి, ఆర్‌డిఒ ఝాన్సీరాణి, డిఇఒ శ్యామ్‌సుందర్‌, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్‌, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.శర్మిష్ట, తహశీల్దారు ఎస్‌ఎస్‌.శాంతి, ఎంపిడిఒ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.