May 26,2023 20:02

వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి

కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ నిందితుడు అరెస్టు
- జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి వెల్లడి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     నంద్యాల జిల్లా కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి వక్ఫ్‌ బోర్డ్‌ భూమిని పట్టా భూమిగా చేసిన కేసులో ముద్దాయి సాయబోయిన ఉపేంద్రను అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ముద్దాయిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ మహానంది తహశీల్దార్‌ జనార్ధన్‌ శెట్టి పిర్యాదు మేరకు సంజామల మండల కేంద్రానికి చెందిన సాయబోయిన ఉపేంద్రపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మహానంది మండలం యూ.బొల్లవరం గ్రామానికి చెందిన శీనయ్యకి చెందిన సర్వే నంబర్‌ 486/2లో 2.66 ఎకరాల వక్ఫ్‌బోర్డ్‌ భూమిని నిషేధిత జాబితా నుండి తొలగిస్తానని కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ కాపీని తన ల్యాప్‌టాప్‌లో తయారు చేసి కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాన్ని సృష్టించాడని తెలిపారు. ఈ విషయంపై మహానంది తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముద్దాయిని నంద్యాలలోని ఎస్‌పివై రెడ్డి స్కూల్‌ వద్ద అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. సాయబోయిన ఉపేంద్ర 2008 నుండి 2010 వరకు సంజామల మండలంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో చిన్న చిన్న కంప్యూటర్‌ పనులు చేస్తూ రెవిన్యూ రికార్డుల మీద అవగాహన పెంచుకున్నాడని తెలిపారు. జూపాడుబంగ్లా మండలంలోని పారుమంచాల గ్రామంలో బుక్కపురం బొందిలి సుభాన్‌ సింగ్‌ చుక్కల భూమి సర్వే నంబర్‌ 373/ఎ, 373/బి1ని భార్య, బావ మరిది పేర డబ్బులు తీసుకొని ఆన్‌లైన్‌లో ఎక్కించాడని చెప్పారు. అలాగే బుక్కపురానికి చెందిన సంగా చిన్నయ్యకు వక్ఫ్‌ బోర్డు భూమి నుండి పట్టా భూమిగా చేసి ఆన్‌లైన్‌లో ఎక్కించడానికి జూన్‌ 10వ తేదీ నాటి కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ పాతది తీసుకుని అందులో సంతకం వివరాలు మొత్తం జాయింట్‌ కలెక్టరు సంతకంతో ఎండార్స్‌మెంట్‌ను తన సొంత ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌ ద్వారా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్‌ తయారు చేసి వాటిని ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌గా చెలామణి చేశారన్నారు. ముద్దాయి వద్ద నుండి ఒక డెల్‌ కంపెనీకి చెందిన ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌ను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. 2018 నుండి జిల్లాలోని పలు మండలాలో అవకతవకలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని, దానిపై విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.