కలెక్టర్ చెప్పినా ఆన్‌లైన్ చేయరంటా..
- ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ ఉంటేనే తహశీల్దార్, విఆర్‌ఒ చేస్తామంటున్నారు..
- న్యాయం చేయాలని స్పందనలో కల్వటాల నిరుపేద రైతులు మొర
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
'20 ఏళ్లుగా బంజరు భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఆ భూమిని తమ పేరు మీద సబ్ డివిజన్ ఆన్‌లైన్ చేయాలని స్థానిక తహశీల్దారును, విఆర్‌ఒను కలిసి అడిగితే స్పందించడం లేదు. కలెక్టర్ సారు చెప్పినా ఆన్‌లైన్ చేయబోమని చెబుతున్నారు. ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్‌తో వస్తేనే ఆన్‌లైన్ చేస్తామంటున్నారు అధికారులు.. మీరైనా న్యాయం చేయండి' అంటూ కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామానికి నిరుపేద రైతులు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామాన్‌కు మొరపెట్టుకున్నారు. సోమవారం స్పందనలో రైతులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం బాధిత రైతులు మాట్లాడుతూ కల్వటాల గ్రామానికి చెందిన సర్వే 26/3లో 73 ఎకరాల బంజరు భూమి ఉందని తెలిపారు. ఈ భూమిలో దాదాపు 25 కుటుంబాల నిరు పేద రైతులమైన తాము కొంత సాగు చేసుకుంటూ గత 20 ఏళ్లుగా జీవిస్తున్నామని చెప్పారు. కొంత మంది రైతులు మామిడి చెట్లు వేసుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఈ భూములపై అనుభవంలో ఉన్న తమ పేర్ల మీద సబ్ డివిజన్ చేసి ఆన్‌లైన్ చేయాలని స్థానిక తహసీల్దార్‌ను, విఆర్‌ఒను కోరగా స్థానిక ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ ఉంటేనే ఆన్‌లైన్ చేస్తామని, కలెక్టర్ చెప్పినా చేయబోమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే బంజరు భూములలో సర్వే 26/8లో 1.35 ఎకరం కామిని మాధవికి, సర్వే 35/బిలో 7.14 ఎకరాలు కామిని తిమ్మారెడ్డిలకు ఇచ్చారని, వాళ్లు ఎలాంటి సాగులో లేరని, అయినా ఆన్‌లైన్ చేసి పట్టాదార్ పాసు పుస్తకాలు కూడా ఇచ్చారని తెలిపారు. 20 ఏళ్లుగా తాము అనుభవంలో ఉన్నా ఆన్‌లైన్ చేయడం లేదన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకోని సబ్ డివిజన్, ఆన్లైన్ చేయించి పట్టాదారు పాసు బుక్‌లు ఇప్పించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో నిరుపేద రైతులు వంకదారి మేరీ, వంకదారి దానమ్మ, వంకదారి భారతి, పిట్టర్ బిబీ, కైపా సావిత్రి, కోటా సుబ్బమ్మ, చాకలి వరలక్ష్మి, బోయ భూలక్ష్మి, వంకదారి ప్రభాకర్, దూదేకుల పెద్ద మాబు, తెలుగు వెంకటరాముడు, తలారి ప్రమీల, వి.రఘు రాముడు తదితరులు ఉన్నారు.










