Sep 21,2023 19:31

రిలే దీక్షలో కూర్చున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - గోనెగండ్ల
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కక్ష సాధింపుతోనే మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేయించారని టిడిపి మండల నాయకులు విమర్శించారు. గురువారం గోనెగండ్లలోని బస్టాండ్‌ సమీపంలో 9వ రోజూ రిలే దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలో ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలాలకు చెందిన బీసీ, ఎస్సీ, మైనార్టీ నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ఎంతో మంది యువత శిక్షణ పొంది ఉద్యోగాలు లబ్ధి పొందారని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా, ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకున్నా కేవలం చంద్రబాబుపై వ్యక్తిగత కక్ష సాధింపు, ఓర్వలేనితనంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సిఐడి సహకారంతో పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారని విమర్శించారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటికి వస్తారని అన్నారు.
రక్తంతో రాసిన తిరుపతయ్య నాయుడు
రిలే దీక్ష శిబిరం వద్ద చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని 'నేను సైతం బాబు కోసం' అని సంతకాల బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డుపై 'విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేను సైతం బాబు కోసం' అని టిడిపి మండల ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య నాయుడు రక్తంతో రాశారు. టిడిపి ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షులు సుందరరాజు, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు దావీదు, నందవరం నాయకులు బాలరాజు, నియోజకవర్గ పరిశీలకులు శ్రీరాములు, గోనెగండ్ల నాయకులు రహంతుల్లా, బేతాళ బడే సాబ్‌, రామాంజనేయులు, తిరుపతయ్య నాయుడు, శ్రీధర్‌ నాయుడు, రంగస్వామి నాయుడు, రమేష్‌ నాయుడు, అచ్చుగట్ల కొత్తింటి ఫక్రుద్దీన్‌, పూజారి చంద్రశేఖర్‌, చిన్న నేలటూరు నాగన్న, ఉప సర్పంచి ఖాసీం, లింగందిన్నె నాయుడు, వినోద్‌ పాల్గొన్నారు.