Sep 10,2023 19:56

సమావేశంలో మాట్లాడుతున్న వీరభద్రగౌడ్‌

ప్రజాశక్తి-ఆలూరు
టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టిడిపి ఆలూరు మాజీ ఇన్‌ఛార్జీ వీర భద్ర గౌడ్‌ తెలిపారు. ఆదివారం ఆలూరులోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధిపై లేని ఆత్రుత ప్రతిపక్ష నేతలను, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు పేరు లేకున్నా సిఐడి అధికారులు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే ముందు గవర్నర్‌ అనుమతి తీసుకొని నోటీసు ఇవ్వాలన్నారు. అలాంటి నిబంధనలు పాటించకుండా జగన్‌ డైరెక్షన్‌లో అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అరెస్టు రాష్ట్ర ప్రజల్లో సానుభూతిని కలిగించిందని చెప్పారు. జరగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పి జగన్‌ మళ్లీ జైలుకు వెళ్లేలా చేస్తారన్నారు. అంతకుముందు దేవరగట్టులోని మాల మల్లేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించి చంద్రబాబు నిర్దోషిగా బయటికి రావాలని 101 టెంకాయలు కొట్టారు.