ప్రజాశక్తి -పెనుకొండ : కియా ఇండియా గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి పెంపుదలతో సాధికారత కల్పిస్తుందని కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని అమ్మవారి పల్లి లోని కియా ఇండియా ప్లాంట్ ప్రాంగణానికి సమీపంలో సిఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా టింబక్ట్ కలెక్టీవ్ సంస్థ సహకారంతో గ్రామీణ మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ, టింబక్టు కలెక్టివ్ ప్రతినిధులు బబ్లూ గంగూలీ, కో-ఫౌండర్ మేరీ వట్టమట్టం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కబ్డాంగ్ లీ మాట్లాడుతూ కియా ఇండియా గ్రామీణ మహిళలకు స్థిరమైన జీవనోపాధిని నిర్మించి, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని భావిస్తోందన్నారు. 75 మంది మహిళలు 36 వారాలు శిక్షణ పొందుతారని వారి 90 రోజుల శిక్షణలో రోజుకు 350 రూపాయల స్టైఫండ్ అందిస్తామని చెప్పారు. ఏడాది పొడవునా అభ్యర్థులకు శిక్షణ సహాయంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలతో శిక్షణా కేంద్రం ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో శిక్షణ పొందిన వారు తమ స్వంత సంస్థలను స్థాపించడానికి, ఆర్థికవృద్ధికి దోహదపడేలా మెంటార్‌షిప్ పొందగలరని ఆశిస్తున్నామన్నారు. స్థానిక విద్యార్థుల కోసం ఆటో సర్వీస్ టెక్నీషియన్ పోగ్రాం పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైబ్రరీ బ్లాక్ బిల్డింగ్, ఐటిఐ కళాశాల ఆధునిక ల్యాబ్‌ల సహకారం, అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ క్యాథ్ ల్యాబ్‌కు వినియోగ వస్తువుల విరాళం వంటి ఇతర సి ఎస్ ఆర్ కార్యక్రమాలలో భాగంగా కియా ఇండియా సుబ్బరాయుని పల్లిలో ప్లాంటేషన్ అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కియా ఇండియా పిఆర్‌ఒ తేజస్వి బండారి, కియా ఇండియా సిఎస్‌ఆర్ ప్రతినిధులు, టింబక్ట్ కలెక్టీవ్ సంస్థ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.










