Aug 16,2023 21:31

కెజిబివి విద్యార్థిని మనస్వినిని అభినందిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, డిఇఒ ప్రేమ్‌కుమార్‌

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం :  గుమ్మలక్ష్మీపురంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని సామల మనస్వినికి అరుదైన అవకాశం లభించింది. అమెరికాలో నిర్వహించే ఐక్యరాజ్యసమితి సదస్సులో ఆమె పాల్గొని, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావిధానం ద్వారా మన్యం జిల్లాలో విద్యార్థులు ఏ విధంగా లబ్ధిపొందవచ్చో ప్రసంగించనుంది. ఈ మేరకు కలెక్టరు నిశాంత్‌కుమార్‌ బుధవారం ఆ విద్యార్థి మనస్వినిని అభినందించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు అంతర్జాతీయ అంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 10 మంది విద్యార్థులతో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయించిందని కలెక్టర్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 మంది విద్యార్థులను రాత పరీక్ష కోసం గుర్తించగా, అందులో 30 మందిని వర్చువల్‌ స్పీకింగ్‌ టెస్ట్‌ కోసం గుర్తించి, వారిలో పది మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పది మంది విద్యార్థులను ఎంపిక చేయగా, ముఖ్యమంత్రి ప్రత్యేక సిఫార్సుతో 9వ తరగతి చదువుతున్న మనస్విని ఎంపిక చేసినట్లు వివరించారు. ఐరాస కేంద్ర కార్యాలయంలో సెప్టెంబరు 18, 19 తేదీలలో జనరల్‌ అసెంబ్లీ ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధిపై ఉన్నత స్థాయి రాజకీయ ఫోరంలో పాల్గొంటారని, నాడు-నేడు (పాఠశాల విద్య) కార్యక్రమాలపై ప్రసంగిస్తారని తెలిపారు. సదస్సులో పాల్గొనడం ద్వారా జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో డిఇఒ ప్రేమ్‌ కుమార్‌, బాలికల అభివృద్ధి అధికారి కె.రోజారమణ, ప్రిన్సిపల్‌ సిహెచ్‌. శ్రీరంజని, పిఇటి ఎన్‌.అరుణజ్యోతి పాల్గొన్నారు.