ధర్మవరం టౌన్ : ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అవినీతి, అక్రమాలన్నింటినీ బట్టబయలు చేస్తామని ధర్మవరం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. జగనాసుర అవినీతి కార్యక్రమం పేరుతో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టిడిపి కార్యాలయంలోపలే నిరసన తెలిపారు. నిరసనలో భాగంగా జగన్ పదితలలతో ఉన్న బొమ్మను చూపతూ జగనాసుర అవినీతి, నేరచరిత్రలోని ఒక్కొక్క అంశాన్ని చదువుతూ, ఒక్కొక్క తల చించుతూ ప్రజలకు వివరించారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకునే రోజు రాష్ట్రంలో రాక్షస పాలన గురించి మాట్లాడుకునే దౌర్భాగ్యం వచ్చిందన్నారు. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, మట్టి మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయన్నారు. ప్రత్యేకించి ధర్మవరంలో ఇసుక మాఫియా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతోందన్నారు. ధర్మవరంలో సామాన్యుడు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. బెంగుళూర్లో చిత్రావతి నది ఇసుకకు డిమాండ్ ఉందంటే ఏ మేర ఇసుక రవాణా జరుగుతుందో తెలుసుకో వచ్చన్నారు. అక్రమ లేఅవుట్లు వేసి సామాన్యులను మోసం చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేతిరెడ్డిని వదిలేదిలేదని ఇసుక, మట్టి మాఫీయాలపై సిట్ వేస్తామన్నారు. తుంపర్తి, మోటుమర్ల గ్రామాల రైతులు తమ గోడును ముఖ్యమంత్రికి విన్నవించుకోవడానికి వెళ్తే వారిని సెక్యూరిటీ ద్వారా పక్కకు నెట్టేసి వెళ్లిపోవడం దారుణం అన్నారు. రైతులకు ఇలాంటి పరిస్థితిరావడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి కారణం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ మంత్రి, ముఖ్యమంత్రి బాబారు వైఎస్.వివేకాహత్య కేసులో అసలు నిందితులకు శిక్ష పడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్, చింతలపల్లి మహేశ్ చౌదరి, నాగూర్‌హుస్సేన్, పురుషోత్తంగౌడ్, అంబటిసనత్, సాహెబ్బీ, బీబీ, పరిశేసుధాకర్, చిన్నరూ విజరు చౌదరి, గంగారపు రవి, గోసలశ్రీరాములు, ఓంకార్, సంగాలబాలు, హోటల్ మారుతిస్వామి, జంగం నరసింహులు పాల్గొన్నారు.










