Apr 02,2023 23:06

matladutunna ravikrishna

కేంద్రం కిచిడి వైద్యం ప్రతిపాదనను విరమించుకోవాలి

ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్‌
కేంద్రప్రభుత్వం ఇంటిగ్రేట్‌ మెడిసిన్‌ పేరుతో ప్రజలకు అందించాలని చూస్తోన్న కిచిడి వైద్యాన్ని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ జి.రవికృష్ణ తెలిపారు. ఆదివారం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో మూడురోజులపాటు స్థానిక ఐఎంఎ హాలులో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఆదివారం సదస్సు ముగింపు సందర్భంగా రవికృష్ణ మాట్లాడారు. ఆధునిక వైద్యాన్ని ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ వైద్యాలను కలగలిపి ఒక కిచిడి వైద్యాన్ని ప్రజలకు అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దీనికి ఇంటిగ్రేట్‌ మెడిసిన్‌గా పేరు పెట్టిందన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ మెడిసిన్‌ విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. వైద్య విధానాలన్నింటిపై ఐఎంఎకు అపారమైన గౌరవం ఉందన్నారు. వైద్య విధానాలను స్వతంత్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రజలు కోరుకున్న వైద్యం అందించాలే తప్ప, ప్రభుత్వానికి కావాల్సిన వైద్యం కాదన్నారు. కేంద్రం స్థాయిలో వైద్యుల రక్షణ చట్టాన్ని తేవాలని, డాక్టర్లపై జరుగుతున్న దాడులకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి సంబంధించిన విధానాలు, నిర్ణయాలు తీసుకునేతప్పుడు ఐఎంఎ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఎంత ప్రయత్నం చేసిన కొన్ని సమయాల్లో రోగిని బ్రతికించలేని పరిస్థితుల్లో రోగి కుటుంబ సభ్యులు డాక్టర్లపై దాడులు చేయటం శోచనీయం. డాక్టర్ల దాడి జరిగిన నేపథ్యంలో 3 ఏళ్ళ శిక్షా చట్టాన్ని 7 ఏళ్ళ శిక్షకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు చేయాలని కోరారు.
జోన్‌ 2 రీజినల్‌ అకాడమీ కాన్ఫరెన్స్‌
ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఎ) మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఐఎంఎ రాష్ట్ర కాన్ఫరెన్స్‌ స్థానిక ఐఎంఎ హాలులో నిర్వహించారు. డి ఎం హెచ్‌ ఓ డాక్టర్‌ గీతాబాయి ఐఎంఎ కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు. జోన్‌ 2 రీజినల్‌ అకాడమీ కాన్ఫరెన్స్‌ వైద్యరంగంలో ఉన్న వైద్యుల సమర్థతను కాపాడటానికి, వైద్య రంగంలోని కొత్త, అభివద్ధి చెందుతున్న ప్రాంతాల గురించి తెలుసుకునేందుకు సహాయపడింది. స్థానికంగా ఉండే డాక్టర్లకు వైద్యవత్తిలో ప్రత్యేకమైన శిక్షణ అందించారు. వివిధ శాఖలు, సూపర్‌ స్పెషలిస్ట్‌, లేటెస్ట్‌ టెక్నాలజీస్‌ ఇన్‌ మెడికల్‌ ఫీల్డ్‌, వైద్యంలోని మెళుకువలు, రీసెర్చ్‌ గూర్చి ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు వివరించారు. అంతేకాక కంటిన్యూయింగ్‌ మెడికల్‌ అర్హత కొరకు ఆరు క్రెడిట్‌ గంటలు (పాయింట్లు) పొందే అవకాశం కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్న వైద్యులకు కలుగుతుంది. టీమ్‌ ఐఎంఏ పర్యవేక్షణలో రీజనల్‌ అకాడమీ కాన్ఫరెన్స్‌ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ రవి కృష్ణ, సెక్రటరీ ఫణిధర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ప్రథమంగా షుగర్‌ వ్యాధి లక్షణాలు, చికిత్స, అత్యాధునిక చికిత్సా విధానం డాక్టర్‌ మురళీకష్ణ వివరించారు. డాక్టర్‌ సతీష్‌ రెడ్డి కిడ్నీ సంబంధించిన వ్యాధులు, నివారణ, రీసెర్చ్‌ తెలియచేశారు. డాక్టర్‌ దుర్గా నాగరాజు ఎముకల విభాగంలో జన్యు సంబంధమైన వ్యాధులు, నివారణ వివరించారు. డాక్టర్‌ రవి కుమార్‌, చిన్నపిల్లల ఆపరేషన్లలో లేటెస్ట్‌ టెక్నిక్స్‌ విసిదీకరించారు. డాక్టర్‌ సోమశేఖర్‌ గుండె వ్యాధులు, అత్యవసరంగా డాక్టర్లు పేషెంట్లకు తీసుకోవాల్సిన మెళుకువలు, ఆధునిక వైద్యం తెలిపారు. డాక్టర్‌ ప్రత్యూష ఆధునిక ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్‌, కంప్యూటర్‌ అసిస్టెంట్‌ టెక్నాలజీ గూర్చి స్త్రీల వైద్య నిపుణులకు వివరించారు. ప్రొఫెసర్‌ డాక్టర్‌ అశ్విని కుమార్‌ రక్తపోటు గూర్చి డాక్టర్లకు చక్కగా విశదీకరించారు. రక్తంలోని విషపూరిత రసాయనాలను డయాలసిస్లో నిర్మూలించడంపై రిసర్చ్‌ కంప్యూటర్‌ టెక్నాలజీ సహాయంతో అందించారు. పాము కాటుకు రూరల్‌ ప్రాంతాల వనరులతో చికిత్స విధానం డాక్టర్‌ డిఆర్కె ప్రసాద్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ శ్రీనివాసాచారి, ఐఎంఏ మచిలీపట్నం శాఖ అధ్యక్షులు డాక్టర్‌ శివప్రసాద్‌, కార్యదర్శి డాక్టర్‌ వై బాల సుబ్రమణ్యం, ఏపిఎంసి అబ్జర్వర్‌ డాక్టర్‌ సుభాష్‌ చంద్ర బోస్‌, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.