Oct 22,2023 00:04

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై దిశానిర్దేశం


కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై దిశానిర్దేశం
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పేదప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్ని రాష్ట్రాలు వాటిని ప్రజలకు చేర్చటంలో అత్యంత ముఖ్యభూమిక పోషిస్తున్నాయని కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. తిరుపతి పర్యటన సందర్భంగా తన శాఖకు చెందిన పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివద్ధి శాఖకు సంబంధించి రాష్ట్రంలో చేపడుతున్న పలు అంశాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. శనివారం సాయంత్రం కేంద్ర మంత్రి, ఎంపీ గురుమూర్తి, మెంబర్‌ రాయుడుతో కలిసి రాష్ట్ర అధికారులతో సంబంధిత శాఖ అంశాలపై సమీక్షించారు. స్వామిత్వా కింద రాష్ట్రంలో గ్రామకంటాలు, వ్యవసాయ భూములు రీసర్వే సమాంతరంగా చేపడుతున్నామని, 17000 గ్రామాల్లో రీసర్వే చేపట్టడం జరిగిందని, సుమారు 13 వేల గ్రామాల్లో ఈసంవత్సరం డిసెంబర్‌ నాటికి డ్రోన్‌ ఫ్లై, ఇమేజింగ్‌ వంటివి పూర్తి అవుతాయని, 4 వేల దాకా గ్రామాల్లో పూర్తి స్థాయిలో రీసర్వే జరిగి హక్కు పత్రాలు అందచేసామని వాటిని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు లింక్‌ చేయడం జరిగిందనీ సర్వే, లాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ మంత్రికి తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7లక్షల ఎస్‌హెచ్‌జిలు అందరూ ఆయూష్మాన్‌ భారత్‌ కింద కవర్‌ అయ్యారని తెలిసి సంతోషించారు. ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం కన్నా ముందు బ్యాంక్‌ లింకేజి తక్కువగా, ఎన్పిఏ ఎక్కువగా ఉండేదని నేడు బ్యాంక్‌ లింకేజీ లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే అందించామని, ఎన్పిఏ 1.7 శాతానికి తగ్గిపోయిందని తెలిపారు. ప్రతి కుటుంబానికి నెలకు 10 వేలకు తక్కువ కాకుండా ఉండేలా నరెగ, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కలిపి పేద కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పొదుపు సంఘాలకు సక్రమంగా తిరిగి కట్టిన వారికి సిబిల్‌ స్కోర్‌ తెలిసేలా వారికి తిరిగి ఇచ్చే రుణాలు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం అందించాలని సూచించారు. అనంతరం కేంద్ర మంత్రిని ఎంపీ, రాష్ట్ర అధికారులు సన్మానించారు. ఈ సమీక్షలో సర్వే, లాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైన్‌, కమిషనర్‌ పంచాయతీరాజ్‌ సూర్య కుమారి స్పెషల్‌ కమిషనర్‌ పంచాయతీ సిరి డైరెక్టర్‌ నరేగా చిన్న తాతయ్య డైరెక్టర్‌, జెసి డికే బాలాజీ, వాటర్‌ షెడ్స్‌ వెంకటరెడ్డి ఈఎన్సి పంచాయతీరాజ్‌ బాలు నాయక్‌, రాష్ట్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికారులు పాల్గొన్నారు.