కదంతొక్కిన అంగన్‌వాడీలు
- కలెక్టరేట్ నుండి నూనెపల్లె బ్రిడ్జి వరకు ర్యాలీ, రాస్తారోకో
- ఐసిడిఎస్‌కు నిర్వీర్యానికి మోడీ కుట్ర
- సమస్యలను విస్మరిస్తే బాబుకు పట్టిన గతే జగన్‌కూ పడుతుంది
- సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి
- మహాధర్నాకు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన 36 గంటల మహాధర్నాలో భాగంగా మంగళవారం అంగన్‌వాడీలు కదం తొక్కారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా కలెక్టరేట్ నుండి నూనెపల్లి బ్రిడ్జి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శోభా రాణి అధ్యక్షత వహించారు. అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం డిఆర్‌ఒ వినతిపత్రం స్వీకరించారు. వారం రోజుల్లో జాయింట్ మీటింగ్ వేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వేతనాలు, ఇతర అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే తెలియజేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో అంగన్వాడీలు రాస్తారోకోను విరమించారు.
అంతకుముందు జరిగిన ధర్నాలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ఐసిడిఎస్‌కు బడ్జెట్ తగ్గించి నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఐసిడిఎస్‌కు బడ్జెట్‌లో కోత విధించడం వలన దేశంలో ఉన్న లక్షలాదిమంది పేద మహిళలు, గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. మోడీ కార్పొరేట్ సంస్థలకు ప్రజాధనాన్ని అప్పనంగా దోచి పెడుతున్నారని అన్నారు. బిజెపి పాలనలో అంబానీ, అదానీలకు తప్ప మరెవ్వరికీ లాభం చేకూరలేదని తెలిపారు. నేటికీ దేశంలో 50 శాతం పైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పారు. 60 శాతం మంది పిల్లలు పౌష్టికాహార లోపంతోనే పుడుతున్నారని పేర్కొన్నారు. ఈ దేశానికి ఆరోగ్యకరమైన భవిష్యత్ తరాలకు అందించే పని కేంద్ర ప్రభుత్వం చేయడం లేదని, ఇది అత్యంత ప్రమాదకరమైనదని అన్నారు. 48 ఏళ్లగా కనీస వేతనాలకు నోచుకోకుండా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పని చేస్తున్నారని తెలిపారు. ప్రమాద బీమా, వేతనంతో కూడిన మెడికల్ లీవ్, పెన్షన్, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు నేటికీ లేకపోవడం సిగ్గు చేటన్నారు. బేటీ బచావో బేటి పడావో నినాదం ఒట్టి మాటలేనని, పసి పిల్లల జీవితాలతో మోడీ ఆటలాడుతున్నారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు, 45, 46 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సభల తీర్మానం మేరకు ఐసిడిఎస్ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో 26 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు 10 కోట్ల మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తున్నారని, వీరి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతని, దాన్ని విస్మరిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా పెంచుతానని ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాలు దాటుతున్నా నేటికీ వేతనాలు పెంచకపోవడం దుర్మార్గమని అన్నారు. ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్లులు, రిటైర్డు వారికి అందిస్తున్న 50 వేల రూపాయలు సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నాయని చెప్పారు. అంగన్వాడీలపై దాడులు పెరిగాయని, సెంటర్ల విజిట్ పేరుతో మానసికంగా వేధిస్తున్నారని, ఇది సరైనది కాదన్నారు. పౌర సరఫరా శాఖ కమిషనర్ రాష్ట్రంలో అక్రమంగా దాచిపెడుతున్న ధాన్యాలను మార్కెట్లో ప్రజా పంపిణీకి తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలని, మరోవైపు రాష్ట్రంలో నకిలీ, నాణ్యతలేని సరుకులు అమ్మకాలు జరుగుతూ కోట్ల రూపాయలలో లాభాలు దండుకుంటున్నారని, అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వ పెద్దలే నాసిరకపు సరుకులు పంపిణీ చేస్తున్నారని, వాటి సంగతి తేల్చకపోగా అంగన్వాడీలను వేధించడం సంమంజసం కాదన్నారు. వేసవి సెలవులలో కూడా అనేక రకాల పనులు అప్పగించి చేయించారని, పేరుకే సెలవులు తప్ప అంగన్వాడీలకు ఒరిగిందేమీ లేదన్నారు. సర్వీస్‌ని బట్టి గ్రాడ్యూటీ ఇవ్వాలని చెప్పినప్పటికీ నేటికి రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. 98 శాతం ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి వెంటనే వేతనాలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని, మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా పరిగణించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహాధర్నాకు మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు ఈ.నిర్మల, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.రమేష్ కుమార్, యువజన సంఘాల నాయకులు, జనవిజ్ఞాన వేదిక జిల్లా నాయకులు రామరాజు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి ఏసురత్నం, ఏ నాగరాజు, జిల్లా నాయకులు తోట మద్దులు, కే మహమ్మద్ గౌస్, భాస్కర్ రెడ్డి, లక్ష్మణ్, బాల వెంకట్, వెంకట లింగం, శివరాం, రత్నమయ్య, భాస్కర్, జిల్లా నలుమూలల నుండి అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు, సక్టార్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.










