అనంతపురం కలెక్టరేట్ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీలు కదం తొక్కారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం నాడు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆదివారం సాయంత్రం నుంచే సిఐటియు, అంగన్‌వాడీ యూనియన్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంగన్‌వాడీలు జిల్లాలో నిరసనలు చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అంగన్‌వాడీలు కలెక్టరేట్ చేరుకుని గేటు మందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వీరి ఆందోళనకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు, నగర కార్యదర్శి వై.వెంకటనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, జిల్లా అధ్యక్షులు ఎటిఎం.నాగరాజు, తదితరులు మద్దతు తెలిపారు. ధర్నా కార్యక్రమానికి అనుమతి లేదని, కలెక్టరేట్ ప్రాంగణం ఖాళీ చేయాలంటూ పోలీసులు నాయకులపై బెదిరింపులకు దిగారు. సమస్యల పరిష్కారంపై నిరసన తెలుపుతుంటే పోలీసులు ఇలా అడుగడుగునా అడ్డుకోవడం ఏమిటంటూ అంగన్‌వాడీలు నిలదీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు సిఐటియు, అంగన్‌వాడీ యూనియన్ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి, వాహనాల్లో ఎక్కించారు. తమ నేతలను అరెస్ట్ చేయరాదంటూ అంగన్‌వాడీలు పోలీసు వాహనాలకు అడ్డుగా బైటాయించి నిరసన తెలిపారు. గంటపాటు పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ఎత్తున మొహరించి పోలీసులు ముఖ్య నాయకులను అక్కడి నుంచి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
హామీలు అమలు చేయని ముఖ్యమంత్రి
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు
అంగన్‌వాడీలకు కనీస వేతనం, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్.జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని ఇప్పుడు దానిని అమలు చేయమంటే నిర్బందాలు విధించడం దుర్మార్గమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు తెలిపారు. కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీల ఆందోళనల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కంటే మెరుగైన వేతనాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. అంగన్‌వాడీలపై కక్ష సాదింపు చర్యలు, రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పు ఆధారంగా గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ప్రజాగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. అరెస్టైన నాయకులను మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పరామర్శించారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్ అంగన్‌వాడీలకు మద్దతుగా హాజరై పరామర్శించారు. అరెస్టైన వారిలో సిఐటయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు, నగర కార్యదర్శి వెంకటనారాయణ, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణ, ఎటిఎం.నాగరాజు, ఆజాం వలీ, ఆదినారాయన, రామలింగారెడ్డి, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు పార్వతి, లక్ష్మిదేవి తదితరులు ఉన్నారు.










