May 19,2023 22:02

నిర్మానుష్యంగా ఉన్న కదిరి పట్టణంలోని ఓ రహదారి

ప్రజాశక్తి ఆమడగూరు :ఎండాకాలం అంటే కొంతవరకు ఎండలు ఉండడం సహజం. కానీ ఈ మధ్యకాలంలో నిప్పులు చెరిగే ఎండలు ఉండడంతో ప్రజలు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక పట్టణాల్లోని ప్రజలు అధిక ఉష్ణోగ్రతతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలికి పోతే గాని పూట గడవనిపరిస్థితిలో ఉన్న కొంతమంది కూలీలు పనుల సమయంలో ఎండ వేడికి తట్టుకోలేక అనారోగ్యాలకు గురవుతున్నారు. కదిరి పట్టణం లో 12 గంటలు దాటిందంటే ఎండ వేడికి తట్టుకోలేక చిరు వ్యాపారులు, ఇతర పనుల మీద వచ్చిన గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా నిలువ నీడ లేకుండా ఉన్న చెట్లను కూడా నరికి వేయడంతో దుకాణాల ముందర నిలబడితే యాజమాన్లు బెదిరింపుతో తరిమేస్తుండటంతో ప్రజలు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. పట్టణంలో మధ్యాహ్నం సమయంలో ఎండకు తట్టుకోలేక దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులు కూడా తీవ్రస్థాయిలో ఉక్కపోతకు గురవుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి ఆందోళన కరంగా ఉంటోంది. ఇక ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న రోగుల పరిస్థితి మరింత అయోమయంగా మారింది. శుక్రవారం కదిరి పట్టణంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.