ప్రజాశక్తి-కదిరి అర్బన్ 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్న అన్న చందంగా కదిరి రోడ్లు, భవనాల అతిథి గృహం పరిస్థితి మారింది. దాదాపు 6లక్షలకు పైచిలుకు విద్యుత్ బకాయిలు ఉండటంతో వసతి గృహానికి కరెంట్ కట్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 10 రోజుల నుంచి విద్యుత్ లేకపోయినా ఎవరూ పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీలు ఉండే వసతిగృహానికే కరెంటు లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై రోడ్డు భవనాల శాఖ డిఇ శైలజ స్పందిస్తూ పాత బకాయిలు దాదాపు రూ.7.5 లక్షలు చెల్లించకపోవడంతోనే విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి పెండింగ్ విద్యుత్ బిలులు చెల్లించి విద్యుత్ సరఫరాలను పునరుద్ధరించాలని కోరారు.
చీకట్లో ఉన్న కదిరి ఆర్‌అండ్‌బి అతిథిగృహం










