- మడిచర్ల అటవీ భూముల్లో రైతుల నిరసన
ప్రజాశక్తి-హనుమాన్‌జంక్షన్: అటవీశాఖ నిర్లక్ష్యం, రెవిన్యూశాఖ అక్రమాలతో మడిచర్ల గ్రామానికి వనరుగా పేదరైతులకు అసరాగా ఉన్న అటవీభూమి కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేదరైతులపై కబ్జాదారులు దౌర్జన్యం చేస్తూ తరిమికొడుతున్నారని సర్పంచ్ ఆజ్మీరా శాంతమ్మ, ఎంపీటీసీ భూక్యాదేవి, కొండపావులూరి రమేష్, పీఏసీఎస్ అధ్యక్షుడు పుట్టా మదన్మోహన్, కృష్ణనాయక్ తదితరులు అగ్రహం వ్యక్తం చేశారు. మడిచర్ల అటవీభూముల్లో పేద రైతులతో కలిసి సోమవారం నిరసన తెలుపుతూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మడిచర్ల గ్రామానికి 3929.70 ఎకరాల సాగు భూమి అందులో 231911 రెవిన్యూ భూమి, ఆర్‌ఎస్ నెం.1 లో 1610.59 ఎకరాల అటవీభూమి ఉందని ఇందులోనే గెజిట్ నోటిఫికేషన్లో 952 ఎకరాలు అటవీభూమిగా నమోదైందని తెలిపారు. కానీ ఇప్పటి సర్వే పరిస్థితుల్లో అటవీభూమి అనేది లేదనే విధంగా అటవీశాఖ నిర్లక్ష్యం వహిస్తోందని, రైతులు అడిగినా సమాధానం చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న భూసర్వే వల్ల తరతరాలుగా భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల పేదప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. రెవెన్యూ సిబ్బంది అక్రమంగా గ్రామంతో సంబంధం లేకుండా హైదరాబాద్, బొంబాయి తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న బడా కబ్జాదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చి వేయడంతో ఎప్పటినుండో సాగు చేసుకుంటున్న పేద బలహీనవర్గాల రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా పేద రైతులను భయభ్రాంతులను చేస్తూ తరిమికొడుతున్నారని వాపోయారు. గ్రామంలో మాదిగలపోడు అని పిలవబడే భూమిలో 40 మందికి ఇళ్లస్థలాలు కేటాయించి ఒక్కొక్కరికీ ఐదు సెంట్ల నివాసభూమి, 119 ఎకరాల సాగు భూమి కేటాయించగా బిఫారంగా శిస్తులు కూడా చెల్లించారని, కానీ ఇంత వరకూ ఎటువంటి పట్టాలు ఇవ్వలేదని, తాము కట్టిన రశీదులు చూపిస్తూ గొరిపర్తి నాగమ్మ అనే మహిళ వాపోయింది. అటవీ, రెవిన్యూ శాఖలు సంయుక్తంగా భూసర్వే నిర్వహించి గ్రామానికి వనరైన అటవీభూమికి హద్దులు నిర్ణయించి 952 ఎకరాల అటవీభూమిని విడగొట్టాలని, అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్న కబ్జాదారులను గుర్తించి అవి రద్దు పరచాలని, 80 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న చిన్నసన్నకారు పేద బలహీన వర్గాల రైతులకు ఇవ్వకుండా కబ్జాదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఎలా ఇచ్చారో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని, సీలింగ్ భూమల్లో 20 సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటూ నివాసముంటున్న రైతులకు, పేదలకు పట్టాలు తక్షణం మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. పేద బలహీన వర్గాలకు ఇళ్లస్థలాలు, సాగు భూమి సర్వే నిర్వహించి తగు న్యాయం చేయకపోతే ఎంత దూరం వెళ్లడానికైనా తాము సిద్ధమని మాజీ సర్పంచ్ శ్రీనునాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు గొరిపర్తి సత్యన్నారాయణ, కంపసాటి యరాజు, గొరిపర్తి శివయ్య, కొమ్ము నాగేసు, కూకటి కనకారావు, తాళం రాజు, పామర్తి మల్లేశ్వరరావు, భూక్యా శ్రీనివాస్, హనుమంతు, శ్రీమన్నారాయణ, సర్పంచ్ అజ్మీరా శాంతమ్మ, ఎంపీటీసీ భూక్యా దేవి, మార్క్ ఫెడ్ కమిటీ చైర్మన్ కొండపావులూరి రమేష్, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు పుట్టా మదన్ మోహన్, మాజీ సర్పంచ్ భూక్యా శ్రీనునాయక్, మాజీ ఎంపీటీసీ ఆజ్మీరా కష్ణనాయక్, గొరిపర్తి గంగరాజు, కంభాల రాముడు, భూక్యా మోత్యా తదితరులు పాల్గొన్నారు.










