ప్రజాశక్తి - కౌతాళం
స్థలాలు కబ్జా చేసే అవసరం రాంపురం రెడ్డి సోదరుల వంశానికే అవసరం లేదని, టిడిపి నాయకులు తిక్కారెడ్డి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హితవు పలికారు. గురువారం మండలంలోని ఎరిగేరి గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎరిగేరి గ్రామానికి సంబంధించిన ఇంటి స్థలాలను తమ కుటుంబ సభ్యులు కబ్జా చేశారని టిడిపి నాయకులు చెప్పడంలో వాస్తవం లేదన్నారు. కబ్జా చేసినట్లు ఆధారాలతో నిరూపించాలని సవాలు విసిరారు. ప్రభుత్వ భూమిలో తన సోదరుడు వై.సాయి ప్రసాద్ రెడ్డి పట్టాలు పంపిణీ చేశారని తెలిపారు. ఆ తొమ్మిది ఎకరాల పొలంలో అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా స్థలాలు చూపించాలని ఆదేశించారు. ఈ విషయంపై కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. పట్టాలు పంపిణీ చేసి సంవత్సరాలు గడిచినా, గత టిడిపి ప్రభుత్వంలో ఎందుకు ప్రజలకు చూపలేకపోయారని ప్రశ్నించారు. పేదలకు సహాయం చేయడం తప్ప, వారి నుంచి లాక్కోవడం అనేది తన రాజకీయ చరిత్రలోనే లేదన్నారు. తిక్కారెడ్డి లాగా మోసం చేయడం తనకు రాదన్నారు. రైస్ మిల్ వారిని మోసం చేసిన కేసులో కొన్ని నెలలు జైలు జీవితం గడిపిన ఘనత తిక్కారెడ్డికే దక్కిందన్నారు. ఎరిగేరి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి కంపు తిక్కారెడ్డికే దక్కుతుందన్నారు. తన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి చేసిన పనులు ప్రజలు బాగా గుర్తు పెట్టుకున్నారన్నారు. గతంలో తన గన్‌మేన్ జరిపిన కాల్పుల్లో బుల్లెట్ గాయంతో రాజకీయం చేసి తన కుటుంబంపై బురద జల్లిన విషయం నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసన్నారు. స్ట్రెచర్‌పై గ్రామగ్రామానికి వెళ్లి ఓట్లు అడిగినా ప్రజలు మాత్రం తిక్కారెడ్డికి నమ్మలేదని తెలిపారు. తిక్కారెడ్డి మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు మంచి సేవలు అందిస్తామని పేర్కొన్నారు. అంతకుముందే రూ.40 లక్షలతో ఎరిగేరి గ్రామానికి తాగునీటి సౌకర్యం నిర్మించిన పైపులైన్లను ప్రారంభించారు. వైసిపి నాయకులు దాట్ల కృష్ణంరాజు, దేశాయి ప్రహ్లాద చారి, లక్ష్మిరెడ్డి, ఉరుకుంద ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, నాగరాజుగౌడ్, ఏకం రెడ్డి, ఎంపిపి అమ్రేష్, వైస్ ఎంపిపి బుజ్జి స్వామి, కో ఆప్షన్ సభ్యులు మాబు సాబ్, ఎరిగేరి సర్పంచి గోవిందు, నీలకంఠ రెడ్డి, గురు గౌడ్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడతున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి










