Jul 31,2023 21:45

సభను నిర్వహిస్తున్న ఛైర్‌పర్సన్‌

ప్రజాశక్తి- హిందూపురం : హిందూపురం వైసిపిలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. చివరకు ప్రజా సమస్యలను చర్చించాల్సిన కౌన్సిల్‌ సమావేశం అంశంలో సైతం అధికార పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయారు. సోమవారం కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు చైర్‌పర్సన్‌ ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికి అధికార పార్టీలో ఉన్న 29 మంది కౌన్సిలర్లలో 22 మంది గైర్హాజరయ్యారు. వీరితో పాటు ఎంఐఎం-1, బిజెపి-1, స్వతంత్ర అభ్వర్థి ఒకరు హాజరు కాలేదు. చైర్‌పర్సన్‌తో కలుపుకుని ఏడుగురు వైసిపి, టిడిపి నుంచి ఆరుగురు కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. కోరం ఉండడంతో చైర్‌పర్సన్‌ ఇంద్రజ సభ నిర్వహణకు ముందుకు వచ్చారు. అయితే మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ కోరం లేదని చెప్పి సమావేశం నుంచి వెళ్లి పోయారు. ఈయనతో పాటు మున్సిపల్‌ అధికారులు సైతం వెళ్లి పోయారు. అధికారులు లేక పోయినప్పటికి చైర్‌పర్సన్‌ అజెండాతో పాటు ఇతర ప్రజా సమస్యలపై చర్చించి సభను నిర్వహించారు.
హిందూపురం అధికార వైసిపిలో రోజు రోజుకు వర్గ విబేధాలు హెచ్చుమీరుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిక్యాన్ని చాటుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. సోమవారం ఉదయం 10 : 30 గంటలకు జరగాల్సిన కౌన్సిల్‌ సమావేశాన్ని ఎలాగైన వాయిదా వేయించాలని ఇన్‌చార్జ్‌ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా ఇన్‌చార్జ్‌తో పాటు ముఖ్య నాయకులు తేనేటి విందు పేరుతో కొంత మంది కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి సభకు హాజరు కాకుడదని కోరినట్లు సమాచారం. చైర్‌పర్సన్‌తో పాటు సభకు హాజరు అయిన ఆరుగురు కౌన్సిలర్లను సభ నుంచి తప్పించడానికి నాయకులతో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లు తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే సాధ్యం కాక పోవడంతో కౌన్సిల్‌ హాలులో కూర్చొన్న మున్సిపల్‌ కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చి, సభను వాయిదా వేసి బయటకు రావాలని హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇన్‌చార్జ్‌ వర్గం నేతల ఒత్తిడితో కమిషనర్‌ ఉదయం 10 : 30 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉంటే 11గంటలు అయిన ప్రారంభం కాలేదని, సమావేశానికి కోరం లేదని కమిషనర్‌ అతనికి అధికారం లేక పోయిన సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు మినిట్‌ పుస్తకంలో రాసి వెళ్లి పోయారు. దీంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ స్పందించి సభకు అందరు వస్తున్నారు, కాస్త వ్యవధి ఇవ్వాలని హాజరు అయిన కౌన్సిలర్లతో కలసి కమిషనర్‌ను అభ్యర్థించినప్పటికీ కమిషనర్‌తో పాటు అధికారులు వెళ్లి పోయారు. సభ సాక్షిగా ఒక బిసి మహిళా చైర్‌పర్సన్‌ను ఘోర అవమానం జరిగింది.
టిడిపి కౌన్సిలర్లు ఆందోళన
కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించాలని టిడిపి కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌ పోడియం ముందు బైటాయించి ఆందోళన చేశారు. ఈ సందర్బంగా టిడిపి కౌన్సిలర్లు రమేష్‌ కుమార్‌, రాఘవేంద్ర, సతీష్‌ కుమార్‌, మహాలక్ష్మి, మంజుళ, భారతి మాట్లాడుతు కౌన్సిల్‌ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎప్పుడు నిర్ణయించిన సమయంలో సమావేశాన్ని నిర్వహించలేదన్నారు. ప్రతి సమావేశం ఉదయం 10 : 30 గంటలకు నిర్ణయిస్తే 11 గంటల పైనే సభ ప్రారంభం అయిందన్నారు. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు సభను ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. కమిషనర్‌కు సభను వాయిదా వేసే అధికారం ఏ చట్టం ఇచ్చిందని ప్రశ్నించారు. కమిషనర్‌తో పాటు అధికారులు అందరు రావాలని, సభను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. చివరకు సమావేశం నిర్వహిస్తామని చైర్‌పర్సన్‌ ఇంద్రజ చెప్పడంతో వారు ఆందోళన విరమించి వారికి కేటాయించిన సీట్లల్లో కూర్చొన్నారు.
అధికారులు లేకుండానే సభ నిర్వహణ
కౌన్సిల్‌ మీట్‌ నిర్వహణకు కోరం ఉండడంతో కమిషనర్‌తో పాటు ఇతర అధికారులు లేక పోయినప్పటికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి రావాలని కమిషనర్‌కు పోన్‌ చేసినప్పటికి ఆయన స్పందించలేదు. సమావేశానికి రాలేదు. ఆయనతో పాటు అధికారులు ఎవరు హాజరు కాలేదు. అయినప్పటికి చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు అజెండాలోని 16 అంశాలపై సమగ్రంగా చర్చించి అమోదం తెలిపారు. ఈ సందర్బంగా కౌన్సిలర్‌ రమేష్‌ కుమార్‌ వినాయక చవితి పండుగను పురష్కరించుకుని గుడ్డం కోనేరును అన్ని విదాల అభివృద్ది చేయాలని కోరారు. కోనేరును పరిశీలన చేసి, నిధులు కేటాయించి అభివృద్ది చేస్తామని చైర్‌పర్సన్‌ ఇంద్రజ హామీ ఇచ్చారు. కౌన్సిలర్‌ రాఘవేంద్ర మాట్లాడుతు తన వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. కౌన్సిలర్‌ ఇర్షాద్‌, ఆయూబ్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించే సమయంలో కోరం ఉన్నప్పటికి అధికారులు సభను అవమానించే విధంగా కోరం లేదని చెప్పి, సభ నుంచి వెళ్లి పోయారని,కమిషనర్‌ పై శాఖ పరమైన చర్యలు తీసుకునే విధంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని తీర్మానం చేయాలన్నారు. దీంతో అందరు దీనికి అమోదం తెలిపారు. కౌన్సిల్‌ ను అవమానించి, సభను సైతం లెక్క చేయకుండా సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి సభనుంచి వెళ్లి పోయిన కమిషనర్‌ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ తో పాటు మున్సిపల్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం అన్నారు. సోమవారం కౌన్సిల్‌ సమావేశం అనంతరం చైర్‌పర్సన్‌ ఇంద్రజ తన చాంబర్‌ లో హాజరైన కౌన్సిలర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్‌ నిబందనల మేరకు సమావేశాన్ని వాయిదా, రద్దు చేసే అధికారం కమిషనర్‌కు లేదన్నారు. ఇది తెలినప్పటికీ ఆయన ఏ అధికారంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. సభకు హాజరు అయిన అధికార, ప్రతి పక్ష పార్టీ కౌన్సిలర్లు అందరం కలిసి కలెక్టర్‌ తో పాటు మున్సిపల్‌ ఉన్నతాధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు ఇర్షాద్‌, నాసీరా బాను, రేష్మా, అయూబ్‌, ముస్తక్‌ తదితరులు పాల్గొన్నారు.