కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు
ప్రజాశక్తి-ఉయ్యూరు : భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు హక్కు పత్రం కార్డులు మంజూరు చేయాలని, కౌలు రైతుల పట్ల నిర్దిష్టమైన కార్య చరణ రూపొందించాలని రాష్ట్ర కౌలు రైతు సంఘం కార్యదర్శి ఎం హరిబాబు అన్నారు. బుధవారం ఉయ్యూరు లోని శ్రామిక భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధార్ పాసుపుస్తకాల ఆధారంగానే ఎన్యుమరేషన్ ప్రభుత్వం ప్రకటిస్తుందని కౌలు రైతు దాని ద్వారా నష్టపోయిన పంట సాయాన్ని కోల్పోతున్నాడని సంబంధిత వ్యవసాయ శాఖ కౌలు రైతుకు సరైన మార్గదర్శకాలు ద్వారా కౌలు రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. గతంలో పసుపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక ముందు తుల దగ్గర నుండి దళారీలు అతి తక్కువ రేటుకు కొని సొమ్ము చేసుకున్నారని, అప్పట్లోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లయితే పసుపు పై వచ్చే మద్దతు ధర అధికంగా ఉండి రైతు సంతప్తి వ్యక్తం చేసేవాడన్నారు. ఈ మధ్యకాలంలో విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు కౌలు రైతులు పడ్డారని నేడు అదే ధాన్యాన్ని 1900 చొప్పున కొంటుందని అనాలోచిత ప్రభుత్వ చర్యల వల్ల కౌలు రైతు నష్టపోతున్నాడని ఆయన తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి సమగ్రమైన కార్యాచరణ రూపొందిస్తు న్నామని, త్వరలోనే కౌలు రైతులందరినీ సమీకరించి సమస్యల పరిష్కారం దిశగా పయనింప చేస్తామని అన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులందరూ కోటి యాభై లక్షల వరకు ఉన్నారని ప్రభుత్వం వీరిపై చిన్న చూపు చూస్తే వచ్చే ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హరిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోసూరు శివ నాగేంద్రం పంచకర్ల రంగారావు తదితరులు పాల్గొన్నారు.










