Jul 26,2023 19:15

పాఠశాలను సందర్శిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
కురుస్తున్న వర్షాల కారణంగా స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత శ్లాబ్‌ గోడల్లో నుంచి నీరు కారుతోందని వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, సర్పంచి భీమయ్య తెలిపారు. బుధవారం పాఠశాలను వారు పరిశీలించారు. నూతన పాఠశాల భవనంలో వర్షపు నీటి వల్ల కారుతోందని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు సచివాలయ కో కన్వీనర్‌ వికెసి రాఘవేంద్రాచారి నీటి లీకేజీ ఉన్న ప్రాంతాలను పరిశీలించి, కారణాలను పరిశీలించారు. వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని భవన నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ కరుణాకర్‌ రెడ్డికి తెలిపారు. వర్షపు నీరు కిందికి వెళ్లేలా ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలోనే పనులు ప్రారంభించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. పాఠశాలలో ఆన్‌లైన్‌ క్లాస్‌లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి విద్యా బోధనలో పురోగతి సాధించాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. ఉపాధ్యాయులు రామన్న, పిఇటి నరసింహరాజు ఉన్నారు.