Jul 02,2023 21:42

సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ:కార్పొరేట్లకు మేలు చేసే జిపిఎస్‌ తమకు వద్దు అని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎస్‌. జయ చంద్రారెడ్డి, కె.నాగేంద్ర అన్నారు. ఆదివారం పట్టణంలో యుటిఎఫ్‌ శ్రీసత్య సాయి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అత్యవసర జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎస్‌.జయచంద్రారెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్లకు మేలు చేకూర్చే జిపిఎస్‌ను అంగీకరించబోమని, ప్రత్యామ్నాయం ఒపిఎస్‌ మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలన్నారు. ఒపిఎస్‌ను అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని సంక్షోభంలో నెట్టే జీవో నెంబర్‌117 ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ బదిలీలు 2023 జరిగిన సందర్భంగా ఉపాధ్యాయులకు పొజిషన్‌ ఐడీలు, రీఅప్పోర్షన్‌ ఖాళీలకు సంబంధించిన క్యాడర్‌ స్ట్రెంత్‌ ను అప్డేట్‌ చేసి ఉపాధ్యాయులకు సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ట్రెజరీ అధికారులతో సమన్వయం చేసుకొని ఎంటిఎస్‌ 2008,1998 ఉపాధ్యాయులకు తొందరగా వేతనాలు చెల్లించే విధంగా చూడాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు కె.భూతన్న, సహ అధ్యక్షులు జిహెచ్‌.బాబు, కోశాధికారి ఎం.సుధాకర్‌, జిల్లా కార్యదర్శి ఈ.నారాయణస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవి.మారుతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.