ప్రజాశక్తి -పెనుకొండ : గ్రామపంచాయతీ స్వచ్ఛభారత్ కార్మికులు తమ వేతనాల పెంపు, పర్మినెంట్ తదితర సమస్యల పరిస్కారం కోసం ఉద్యమాలకు సన్నద్ధం కావాలని ఎపి గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ పిలుపు నిచ్చారు.బుధవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఎపి గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సత్యసాయి జిల్లా కమిటీ సమావేశాన్ని ఆసంఘం జిల్లా అధ్యక్షులు సజ్జరాయప్ప అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో రమేష్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ స్వచ్ఛభారత్ కార్మికులు అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్నారన్నారు. కార్మికులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొడ్డు చాకిరీ చేయించుకున్నాయే తప్ప వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల తలరాత మారలేదన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారి సమస్య పరిష్కారం కోసం సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి, సిఐటియు నాయకులు తిప్పన్న, మహేష్, శ్రీరాములు, గ్రామపంచాయతీ స్వచ్ఛభారత్ కార్మికుల యూనియన్ నాయకులు ఆది, అక్కలప్ప, మహబూబ్ బాషా, మద్దిలేటి, ఆదినారాయణప్ప, నరసింహ తదితరులు పాల్గొన్నారు.










