రాష్ట్ర విభజన తరువాత హక్కులను హరించిన పాలకులు
ఐఆర్‌ఎపి రాష్ట్ర సదస్సులో పలువురు వక్తలు
ప్రజాశక్తి-ప్రత్యేక ప్రతినిధి కర్నూలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిరంగ కార్మికులకు, చేనేత కార్మికులకు, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎస్‌సి ఎస్‌టిలకు తీవ్ర అన్యాయం జరిగిందని, వారికి రాజకీయంగా సంక్రమించిన హక్కులను కూడా హరించి వేసే పద్దతలను పాలకులు అనుసరిస్తున్నారని నిపుణులైన వక్తలు అభిప్రాయ పడ్డారు. ఆదివారం కర్నూలు బిర్లా కాంపౌండ్ లోని బ్రహ్మారెడ్డి హాస్పిటల్ సెమినార్ హాల్లో ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఐఆర్‌ఎపి(ఇనిస్టిట్యూట్ పర్ రీసెర్చ్ ఆన్ ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో రెండు రోజుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. వేదిక రెండో రోజు రాష్ట్ర అధ్యయన వేదిక నుంచి మోహన్‌రావు అధ్యక్షతన మొదటి సెషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కులం-రాజకీయం అంశంపై దళిత ఉద్యమ నాయకులు కొరివి వినయకుమార్, కోనసీమ, లేక కులాలసీమ అంశంపై డాక్టర్ సతీష్ చెన్నూరు, సంక్షేమం -రాజకీయాలు, నగదు బదిలీ పథకాల అంశంపై ఎపి అధ్యయన వేదిక గోపాలరావు మాట్లాడారు. రెండో షెషన్‌లో శ్రీపాద్ మెరాం అధ్యక్షతన రాజధాని నగరం, నగరాజు-విమర్శనాత్మక పరిశీలన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొప్రెసర్ రామచంద్రయ్య, ప్రొఫెసర్ పురేంద్రప్రసాద్, చిన్నపట్టణాలు, నేత కార్మికుల అభివృద్ధి అంశంపై రాష్ట్ర చేనేత జనసమాఖ్య నుంచి మోహన్‌రావు, విభజన అనంతరం ఎపిలో కార్మికుల స్థితిగతులు మాజీ ఎమ్మెల్యే , సిఐటియు జాతీయ నాయకులు ఎంఏ. గఫూర్ ప్రసంగించారు. ఆరోగ్య సంరక్షణ ప్రయివేటీకరణ గురించి జెవివి నాయకులు నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ , జనరల్ సర్జన్ డాక్టర్ ఎస్‌కె.కలేషా సాహెబ్ మాట్లాడారు.
నానాటికి దిగజారుతున్న కార్మికులు పరిస్థితులు : ఎంఏ.గఫూర్
రాష్ట్ర విభజన తరువాత టిడిపి, వైసిపి ప్రభుత్వాలు సరళీకరణ ఆర్థిక విధానాలకు సంపూర్ణంగా అమలు జరిపినందున కార్మికులు స్థితిగతులు నానాటికి దిగజారుతున్నాయని సిఐటియు జాతీయ నాయకులు ఎంఏ.గఫూర్ తెలిపారు. ఎపిలో సుమారుగా కోటి రూ.20 లక్షల మంది కార్మికులు ఉండగా అందులో 90శాతం అసంఘటిత కార్మికులు వివిధ వృత్తులో విభజించబడి ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్‌కోడ్‌ల ద్వారా కార్మికుల హక్కులను బలహీన పరిచిందన్నారు. రాష్ట్రంలో కార్మిక శాఖనునిర్వీర్యం చేశారన్నారు. పనిగంటలు, ఉద్యోగభద్రత, అక్రమ తొలగింపులపై చర్యలు, బోనసు, గ్రాడ్యుటీ తదితర చట్టాలను అమలు చేసే దాదాపుగా లేకుండా పోయిందన్నారు. ఈజ్‌ఆప్ డూయిండ్ బిజినెస్‌లో అవార్డులు పొందడాన్ని గొప్పగా భావిస్తూ కార్పొరేట్ల అనుకూల ప్రభుత్వాలుగా ముద్రవేసుకోవడానికి రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. దీని వలన కార్మికుల సమస్యలపై ఎవ్వరికీ శ్రద్ధలేకుండా పోయిందన్నారు. కార్మిక ఉద్యమాలను అణచి వేసే స్వభావం పాలకుల్లో పెరిగిందన్నారు. కార్మికులకు వేతనాలు పెరిగితే కొత్తపెట్టుబడి దారులు రాష్ట్రానికి రారనే దురుద్దేశంతో వేతనాలు పెంచడం లేదన్నారు. వేతనాలు పెరిగితే ఉత్పత్తివ్యయం పెరుగుతుందనే సాకుతో కనీస వేతనాలు సవరించడం లేదని తెలిపారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు ఉద్యోగ, కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలలో పర్యవేక్షణ అధికారులను కుదించడం, కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. చనిపోయిన కార్మికులకు కూడా న్యాయమైన నష్టపరిమారం అందటం లేదన్నారు. అసంఘటిత రంగ కార్మికుల బతుకులు మరింత దుర్భరంగా ఉన్నాయన్నారు.
సగటు మనిషికి సరైన వైద్యం అందడం లేదు: డాక్టర్ ఎస్‌కె.కలేషా సాహెబ్
డాక్టర్ ఎస్‌కె.కలేషా సాహెబ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య రక్షణ పేరుతో ఆరోగ్య శ్రీ తదితర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టినా సామాన్యునికి సరైన వైద్యం అందడం లేదన్నారు. మనరాష్ట్రంలో సగటున మనిషి తన ఆదాయంలో 68 శాతం ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నారన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో 48 శాతం ఖర్చు చేస్తున్నారన్నారు. ఉద్యోగ కార్మికుల వేతనాలు పెరగకుండా ఆరోగ్య రక్షణ ఎలా సాధ్యమవుతుందన్నారు. పౌష్టికాహారం , పరిసరాల పరిశుభ్రత తదితర రోగనిరోధకశక్తిని పెంచే అవగాహన, నివారణ చర్యలతోనే 80 శాతం జబ్బులను నివారించవచ్చన్నారు. కేవలం 20 శాతం మాత్రమే మనిషి శరీర ధర్మాన్ని బట్టి జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు.రాష్ట్ర మెత్తం బడ్జెట్‌లో ఆరోగ్యానికి 0.9శాతం మాత్రమే నిధులు కేటాయిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పెరిగినా ప్రయివేటు విధానంలో నడుస్తున్నాయని తెలిపారు. నిధుల లేమితో ప్రతీది ప్రభుత్వ, ప్రయివేటు పార్టునర్‌షిప్(పిపిపి) పేరుతో నిర్వహిస్తున్నారన్నారు. దీని వలన ప్రయోజనం లేదన్నారు.



కార్మికుల స్థితి గతులను వివరిస్తున్న ఎంఏ.గఫూర్










