ప్రజాశక్తి - కదిరి టౌన్ : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్నిరాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, ఉపాధ్యక్షులు జిఎల్. నరసింహులు విమర్శించారు. కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా నాయకులు సాంబ శివ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను అమలు పర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులకు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కాలేదని విమర్శించారు. కరోనా సమయంలో కాలంలో లక్షాలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.కార్మికుల కోసం వసూలు చేసిన సంక్షేమ బోర్డు నుండి 1150 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఈ నిధులను సంక్షేమ బోర్డుకు జమ చేసి రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.కార్మికుల కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ హెల్పర్ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు యధాతధంగా అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జిఎల్. నరసింహులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బడా సుబ్బి రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సాంబశివ, కార్మికులు రామాంజనేయులు, శీను, అంజినేయులు, క్రిష్ణప్ప, ఆదినారాయణ, లక్ష్మి నారాయణ, సిద్దయ్య బిమ్లానాయక్, సతీష్ కుమార్, సోము తదితరులు పాల్గొన్నారు.










