Aug 01,2023 17:07

చైర్మన్‌కు, కమిషనర్‌కు వినతి పత్రం సమర్పిస్తున్న నాయకులు

కార్మికుల సమస్యల పరిష్కరించాలి
- సిఐటియు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌
- మునిసిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా
- చైర్మన్‌, కమిషనర్‌లకు నాయకులు వినతి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు, సిబ్బంది మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్‌ కార్యదర్శి భాస్కరాచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు మాట్లాడారు. నంద్యాల మునిసిపాలిటీలోని పర్మినెంట్‌, ఇంజనీరింగ్‌, పారిశుధ్య, క్లాప్‌ డ్రైవర్స్‌ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరిని పర్మినెంట్‌ చేయాలన్నారు. మున్సిపల్‌ కార్మికులందరికీ ఎపిసిఒఎస్‌ నుండి మినహాయింపు ఇవ్వాలన్నారు. జీవో 151 ప్రకారం మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోని అర్హత కలిగిన కాంట్రాక్టు కార్మికుకు, జిఒ 7 ప్రకారం కనీస విద్యా అర్హత, సీనియారిటీ ప్రాతిపదికన అర్హత కలిగిన ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రూ.6 వేల హెల్త్‌ అలవెన్సులు, రిస్క్‌ అలవెన్సులు చెల్లించాలని, పనిముట్లు, రక్షణ పరికరాలు ఇప్పించాలని, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కట్టించి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. 60 సంవత్సరాలు పూర్తి అయ్యి రిటైర్డు అయిన వారికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి మహమ్మద్‌ గౌస్‌, అధ్యక్షుడు డి.లక్ష్మణ్‌, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు భాస్కరాచారి, కృష్ణయ్య, రామకృష్ణ, ఆదాము, నాగేశ్వరరావు, కరిముల్లా, రామాంజనేయులు, సిద్దయ్య, రాజు, మహబూబ్‌ బీ, సువర్ణమ్మ, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.