ప్రజాశక్తి-చీమకుర్తి : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక పంగులూరి కృష్ణయ్య భవనంలో సిఐటియు మండల కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ నిత్యావసర ధరలు రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతున్నా, కార్మికుల కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. గ్రానైట్ క్వారీల్లో కార్మిక చట్టాలు అమలు చేయడం లేదన్నారు. జాకీ కార్మికుల కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. కొన్ని గ్రానైట్ కంపెనీలలో ఇప్పటికీ పిఎఫ్ బకాయిలు చెల్లించలేదన్నారు. వెంటనే చెల్లించాలన్నారు.గ్రానైట్ కార్మికుల వేతనాలు పెంచాలని,స్కీంవర్క్‌ర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఐటియు మండల కార్యదర్శి పి. ఆంజనేయులు మాట్లాడుతూ జాకీ కార్మికులకు కూలి రేట్లు పెంచాలన్నారు. కార్మిక చట్టాలు అమలు చేయని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అప్పలనాయుడు, రమణ,ఎ. నాగమణి, రవి, సుశీల, కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.










