Oct 24,2023 23:59
వ్యాపారం లేక వెలవెలబోతున్న ఓ ఫ్యాన్సీ షాపు

ప్రజాశక్తి-పీసీపల్లి: పీసీపల్లి మండలంలో దసరా వేడుకలు కనిపించలేదు. ప్రధానంగా చిల్లర దుకాణాలు, బట్టల షాపుల వద్ద పండుగ వాతావరణం నెలకొని ఉండేంది. కానీ ఈ సంవత్సరం రోజువారి వ్యాపారానికి మించి పది శాతం కూడా వ్యాపారాలు జరగలేదని వ్యాపారస్తులు అంటున్నారు. సహజంగా దసరా రోజు మాంసం దుకాణాలు కూడా ఉదయం పూట బాగా రద్దీగా ఉంటాయి. అలాంటిది ఈరోజు అవి కూడా వెలవెలబోయాయి. మండలం మొత్తం మీద రోజుకు రూ.5 వేలు దాకా వ్యాపారం జరిగే చిల్లర దుకాణాలు పీసీపల్లి మండలం మొత్తం మీద 15 వరకు ఉన్నాయి. ప్రధానంగా గుంటుపల్లి, పెద్ద యర్లపాడు, వెంగళాయపల్లి, పెదఅలవలపాడులో వ్యాపారాలు బాగా జరుగుతాయి. ఆదివారం దుర్గాష్టమి మొదలు, మంగళవారం విజయదశమి వరకు కూడా మూడు రోజులుగా రూ.20 వేల వ్యాపారం కూడా జరగలేదని వ్యాపారస్తులు అంటున్నారు. గతంలో దసరా సందర్భంగా రోజుకు 40 మంది రెడిమేడ్‌ దుకాణాల వద్ద చిన్న పిల్లలకైనా బట్టలు కొనుగోలు చేస్తారు. కానీ సోమ, మంగళవారాల్లో 20 మంది కూడా చిన్న పిల్లల కోసం కూడా కొనుగోలు చేయడం లేదని బట్టల షాపు యజమాని నారపురెడ్డి మాలకొండయ్య తెలిపారు. దూర ప్రాంతాల నుంచి బంధువులు సరిగా రాకపోవడంతో టీ దుకాణాలు, ష్యాన్సీ స్టోర్లు కూడా రోజువారి వ్యాపారం మాత్రమే సాగుతుంది. సంక్రాంతి, కనుమ పండుగ తర్వాత అత్యధికంగా వేట మాంసం, చికెన్‌ వాడేది దసరా పండుగ రోజే. ఈ విధంగా ఎలాంటి వ్యాపారాలు జరగక దసరా పండుగ వెలవెలబోయింది. గత సంవత్సరం మిరప పంట మినహా వ్యవసాయంలో పెద్దగా ఆదాయం లేకపోవడం, ఈ సంవత్సరం వర్షాలు లేక పెద్దగా వ్యవసాయం సాగు చేయకపోవడం మూలంగా దసరా పండుగను పెద్దగా చేయలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.