ప్రజాశక్తి-కోసిగి
కానిస్టేబుల్ విధి నిర్వహణలో అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. అన్యాయం జరిగిన బాధితులు న్యాయం కోసం స్టేషన్‌కు వస్తే వారికి భరోసా కల్పించాలి. వారి అవకాశాన్ని ఆసరాగా చేసుకుని డబ్బుల వసూళ్లకు పాల్పడుతూ... అక్రమ కర్ణాటక మద్యం దారులతో, ఇసుకాసురులతో సంబంధాలు పెంచుకొని డబ్బుల వసూళ్లకు తెరలేపాడు ఓ కానిస్టేబుల్... ఇవన్నీ సరిపోక పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ప్రయివేట్ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయురాలిని, మహిళ జిఎస్‌ఎంకెతో అతి చనువుగా ఉంటున్నట్లు సమాచారం. టూ పోలీసు స్టేషన్‌లో డబ్బా రైటర్‌గా అంతా తనదే పెత్తనం కావడంతో ఉన్నతాధికారులకు అన్ని విషయాలు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కోసిగి పోలీసు స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్ 'డబ్బా రైటర్'గా పని చేస్తున్నారు. వారం రోజుల క్రితం జుమ్మాలదిన్నె గ్రామ సమీపంలోని ఉరుకుంద రోడ్డులో ఆర్‌టిసి బస్సు, కారు ఢకొీన్న ఘటనకు సంబంధించి ఆర్‌టిసి డ్రైవర్, కారు డ్రైవర్ కోసిగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే ఆసరాగా చేసుకున్న కానిస్టేబుల్ ఆదోనికి చెందిన ఫొటోగ్రాఫర్, కారు యజమానికి కేసు లేకుండా చేస్తానని చెప్పి స్టేషన్ ఖర్చులకు మొదటి విడతగా రూ.8 వేలు, మరో రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కారు యజమానికి తెలిసిన ఓ విలేకరికి సమాచారం ఇవ్వడంతో ఆ విలేకరి కోసిగి సిఐ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వెంటనే సిఐ ఆ కానిస్టేబుల్‌ను పిలిచి గట్టిగా మందలించినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలే కాకుండా ఆ కానిస్టేబుల్ స్టేషన్‌లో తనదే పెత్తనం కావడంతో వేరే వ్యక్తుల సిమ్ తీసుకొని కోసిగిలోని అక్రమ కర్ణాటక మద్యం తరలించే వ్యక్తులకు, అక్రమ ఇసుక తరలించే ట్రాక్టర్ డ్రైవర్లకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇసుక తరలించే ట్రాక్టర్ డ్రైవర్ల ద్వారా రూ.15 వేల చొప్పున నెలకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కోసిగికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌తో సంబంధం ఏర్పరచుకొని అతని ద్వారా అక్రమ వసూళ్లకు తెర లేపినట్లు స్టేషన్‌లో పనిచేసే పోలీసులకు, ప్రజలకు తెలిసిన విషయమే. పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ప్రయివేట్ పాఠశాలలో తన పిల్లలను చేర్పించారు కానిస్టేబుల్. ఆ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయురాలితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె భర్తకు తెలిపారు. భర్తతో కలిసి గతంలో పనిచేస్తున్న ఎస్‌ఐ దగ్గరకొచ్చి కానిస్టేబుల్ చేసిన అసభ్యకర పనులను వివరించారు. కానిస్టేబుల్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తానని ఉపాధ్యాయురాలి భర్తకు ఎస్‌ఐ చెప్పి పంపించేశారు. కానిస్టేబుల్ తీరులో ఎలాంటి మార్పూ రాకపోవడంతో ఉపాధ్యాయురాలిని పాఠశాల మాన్పించేశారు. గ్రామ సచివాలయ మహిళా పోలీసుతో రెండేళ్లుగా చనువుగా ఉంటున్నట్లు స్టేషన్ సిబ్బందికి, కోసిగి ప్రజలకు తెలిసిన విషయమే. ఇన్ని విషయాలు తెలిసినా ఆ కానిస్టేబుల్‌పై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. స్టేషన్‌లో బాగా డబ్బులు వసూలు చేస్తున్నాడన్న పేరు ఆ కానిస్టేబుల్‌కు ఉంది. పోలీసు అధికారుల ఆశీస్సులు ఉండడంతో ఆ కానిస్టేబుల్ మరింత రెచ్చిపోతున్నారు. జిల్లా పోలీస్ అధికారులు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకొని శాంతిభద్రతలను కాపాడాలని కోసిగి ప్రజలు కోరుతున్నారు.
కోసిగి పోలీసు స్టేషన్










