Jun 30,2023 21:56

మున్సిపల్‌ మీట్‌లో పాల్గొన్న అధికారులు, సభ్యులు

ప్రజాశక్తి కదిరి అర్బన్‌ : మున్సిపాలిటీలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఒక పెద్ద మాఫియాగా కొనసాగుతున్నారని పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం వస్తే అందరికన్నా ముందుంటున్న కాంట్రాక్టర్లు ప్రజలకు ఉపయోగపడే పనులు వస్తే ఏమి మిగలదని వెనక్కి పోతున్నారని విమర్శించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నజీమున్నీసా అధ్యక్షతన మున్సిపల్‌ సర్వసభ్యసమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా కౌన్సిలర్‌ కిన్నెర కళ్యాణ్‌కుమార్‌ తదితరులు మాట్లాడుతూ కాంట్రాక్టర్ల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం వచ్చే పన్నుల్లో మాత్రం అప్పటికప్పుడు అజెండాలో చేర్చి బిల్లులు చేసుకోవడం జరుగుతుందని విమర్శించారు. కొన్ని నెలలుగా తన వార్డులో చిన్న చిన్న పనులు చేయాలని అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి అజెండాలో చేర్చాలని కోరుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు ఆదాయం ఉంటే తప్ప పనులు చేయరా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. స్పందించిన కమిషనర్‌ శ్రీహరి బాబు మాట్లాడుతూ ఏడవ వార్డులో ఇదివరకే పనులు పూర్తి చేసి మరికొన్ని వాటికి టెండర్లు పిలిచామన్నారు. అయితే కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో సమస్య గానే ఉండిపోయిందని ఆయన అన్నారు. కదిరి మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ల మాఫియా ముఠా కొనసాగుతోందని పనులు చేయని కాంట్రాక్టర్ల, ముందుకు రాని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. మాఫియా లాంటి కాంట్రాక్టర్లను అడ్డుకోవడానికి తామంతా ఏకమవుతామని అన్నారు. అనతరం పలువురు కౌన్సిలర్లు తమ పరిధిలో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ నజీమున్నీసా, కౌన్సిలర్లు బాబా ఫక్రుద్దీన్‌ తదితరులతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.